50 గ్రాముల బంగారు బిస్కెట్..! చాక్లెట్‌లా అలవోకగా మింగేసిన 5 ఏళ్ల చిన్నారి.. పరుగులు తీసిన తల్లిదండ్రులు.. ఉత్కంఠ రేపిన ఆపరేషన్!

చైనాలో ఆడుకుంటున్న 5 ఏళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు 50 గ్రాముల బరువున్న చిన్న బంగారు బిస్కెట్‌ను మింగేయడంతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరింది.

వైద్యులు అత్యంత వేగంగా స్పందించి సర్జరీ చేయడంతో ఆ బంగారు బిస్కెట్ విజయవంతంగా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి పూర్తిగా కోలుకుంది.

ఉత్తర చైనాకు చెందిన 5 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఆడుకుంటోంది. ఆ సమయంలో టేబుల్‌పై ఉంచిన 4 సెంటీమీటర్ల పొడవు, 50 గ్రాముల బరువున్న బంగారు బిస్కెట్‌ను చాక్లెట్ అనుకుని నోట్లో వేసుకుని మింగేసింది.

కొద్దిసేపటి తర్వాత ఆ పాప ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు తీవ్ర భయాందోళనలకు గురై హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే దాన్ని బయటకు తీసేందుకు అవసరమైన ప్రత్యేక వైద్య పరికరాలు లేకపోవడంతో, చిన్నారిని వెంటనే బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని స్థానిక వైద్యులు సూచించారు.

గత ఆదివారం చిన్నారిని బీజింగ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ తీసిన ఎక్స్-రేలో పాప కడుపులో 4 సెంటీమీటర్ల పొడవైన బంగారు బిస్కెట్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ బంగారు బిస్కెట్ గట్టిగా, బరువుగా ఉండటం వల్ల కడుపు లోపలి పొరలను కోసేసి, అంతర్గత రక్తస్రావం జరగడమే కాకుండా అంతర్గత అవయవాలకు రంధ్రాలు పడేంత తీవ్రమైన ముప్పు ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో పాప పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

సర్జరీ చేయడానికి ఎంతో ఇరుకైన చిన్నారి జీర్ణాశయ మార్గంలో ఆ బంగారు ముక్క చిక్కుకుపోయింది. అయినప్పటికీ అనుభవజ్ఞులైన వైద్యుల బృందం వేగంగా శస్త్రచికిత్స ప్రారంభించి, ఎండోస్కోపీ పద్ధతి ద్వారా ప్రత్యేక స్నేర్ (వైర్ లూప్) సహాయంతో ఆ బంగారు బిస్కెట్‌ను ఎంతో జాగ్రత్తగా బయటకు తీసింది.

కొద్ది నిమిషాల్లోనే ముగిసిన ఈ సున్నితమైన చికిత్స తర్వాత పాప ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “5 ఏళ్ల చిన్నారి చేతికి 50 గ్రాముల బంగారు బిస్కెట్ దొరికేలా ఎలా నిర్లక్ష్యంగా ఉంచారు?” అని కొందరు ప్రశ్నిస్తుండగా, “విలువైన, ప్రమాదకరమైన వస్తువులను పిల్లలకు అందకుండా తల్లిదండ్రులు మరింత భద్రంగా దాచుకోవాలి” అని మరికొందరు హితవు పలుకుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *