జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్‌వాడ్ జిల్లాలో 14 ఏళ్ల మైనర్ బాలిక ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది.
గర్భ సంబంధిత వైద్య చికిత్స (అబార్షన్) నిమిత్తం ఆ బాలికను కిష్త్‌వాడ్ నుంచి దోడా జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే మార్గమధ్యంలో బాలిక ఆరోగ్యం విషమించి ప్రాణాలు విడిచినట్లు సమాచారం.
ఆ బాలిక గర్భం దాల్చడానికి ఆమె చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయుడే కారణమని అనుమానిస్తూ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. చట్టపరమైన నిబంధనల ప్రకారం మైనర్ బాలిక వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.
బాలిక గర్భం దాల్చడానికి గల పరిస్థితులు, నిందితుడైన ఉపాధ్యాయుడి ప్రమేయం, అలాగే బాలికను ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు జరిగిన పరిణామాలపై పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో నేరం రుజువైతే నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు, ఘటన వెలుగుచూసిన వెంటనే సంబంధిత ఉపాధ్యాయుడిని విద్యాశాఖ విధుల నుంచి సస్పెండ్ చేసింది. చిన్నారి మృతితో కిష్త్‌వాడ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థినుల భద్రత, స్కూల్ యాజమాన్యాల బాధ్యతపై సర్వత్రా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Leave a Reply