అయ్యో అయ్యో.. లైకుల కోసం నడిరోడ్డుపై పడుకుంటావా?.. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై పడ్డ ఎఫ్‌ఐఆర్ (FIR).. నెటిజన్ల తీవ్ర ఆగ్రహం.!

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రకృతి గౌర్.. లాంతర్న్ కూడలిలోని (Lantern Square) ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న జీబ్రా క్రాసింగ్‌పై పడుకుని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫొటోషూట్ చేసిన వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపింది.

సిగ్నల్ పడి వాహనాలు ఆగివున్న సమయంలో ఆమె రోడ్డుపై పడుకుని వీడియోలు తీయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఏర్పడిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వైరల్ వీడియో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ దృష్టికి వెళ్లడంతో, ఇండోర్‌లోని తుకోగంజ్ (Tukoganj) పోలీసులు ప్రకృతి గౌర్‌ను పిలిపించి విచారించారు. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం, ప్రజల భద్రతకు ముప్పు కలిగించడం తదితర సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా, ఈ రీల్ చిత్రీకరించేందుకు ఉపయోగించిన ఆమె మొబైల్ ఫోన్‌ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఇంటర్నెట్‌లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రకృతి గౌర్ క్షమాపణ చెబుతూ మరో వీడియోను విడుదల చేసింది. అందులో తాను ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించలేదని, కొందరు ఈ వీడియోను తప్పుడు కోణంలో ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. జరిగిన దానికి చింతిస్తున్నానని, భవిష్యత్తులో బహిరంగ ప్రదేశాల్లో వీడియోలు తీసుకునేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని ఆమె వివరణ ఇచ్చింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *