అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం బోకా రాటన్ ప్రాంతంలో 23 ఏళ్ల యువ పైలట్ ఫెయిత్ డెంక్లీ ఒంటరిగా విమానాన్ని నడుపుకుంటూ వెళ్తున్నారు.
బోకా రాటన్ విమానాశ్రయానికి దాదాపు 15 మైళ్ల దూరంలో గాల్లో ఎగురుతున్న సమయంలో, ఆ చిన్న ట్విన్ ఇంజిన్ విమానంలో ఊహించని సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే విమానాన్ని తిరిగి బోకా రాటన్ విమానాశ్రయానికి మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని ఆమె ప్రయత్నించారు. అయితే విమానం ల్యాండింగ్ గేర్ (Landing gear) సరిగ్గా పనిచేయలేదు. దానికితోడు విమానంలో ఇంధనం ఎక్కువ మొత్తంలో ఉండటం, ఇంజిన్లలో ఒకటి పూర్తిగా పనిచేయకపోవడంతో, రన్‌వేపై విమానాన్ని ల్యాండ్ చేస్తే భారీ అగ్నిప్రమాదం జరిగే ప్రమాదం ఉందని ఆమె గ్రహించారు.
నేలపై దించడం కంటే సముద్ర జలాల్లో ల్యాండ్ చేయడమే సురక్షితమని భావించిన ఆమె అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తీరానికి సమీపంలో జనం, భవనాలు లేని ఖాళీ సముద్ర ప్రాంతాన్ని ఎంచుకుని, తన నైపుణ్యంతో పైపర్ PA-30 విమానాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా వాటర్-ల్యాండింగ్ (Ditching) చేశారు.
విమానం నీటిపై దిగిన కొద్ది నిమిషాల్లోనే రెస్క్యూ సిబ్బంది, లైఫ్‌గార్డులు అక్కడికి చేరుకుని ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ముందస్తు జాగ్రత్తగా ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడినట్లు వైద్యులు నిర్ధారించారు. నాలుగేళ్లుగా విమానాలు నడుపుతున్న ఈ యువ పైలట్ చూపిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply