సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి, భయాందోళనలకు గురిచేస్తోంది. సాధారణంగా విషసర్పాలను పట్టుకోవడానికి స్నేక్ స్టిక్స్ (హుక్స్), పటకార్లు, ప్రత్యేక పెట్టెలను ఉపయోగించడం మనం చూస్తుంటాం.
అయితే, ఒక వ్యక్తి ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా, కేవలం ఒక సాధారణ పీవీసీ (PVC) పైపును మాత్రమే ఉపయోగించి భారీ తాచుపామును పట్టుకునే సాహసానికి ఒడిగట్టాడు.
@earth_tracker అనే ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, ఇటుకల గోడపై పడగ విప్పి అత్యంత తీవ్ర ఆగ్రహంతో బుసలు కొడుతున్న ఒక పెద్ద తాచుపాము కనిపిస్తోంది. అక్కడికి వచ్చిన సదరు వ్యక్తి, ‘L’ ఆకారపు ఎల్బో (Elbow) అమర్చిన తెల్లటి పీవీసీ పైపును ఆ పాము తల వద్దకు చాలా నెమ్మదిగా తీసుకెళ్లాడు.
పాము భయంకరంగా బుసలు కొడుతున్న ఆ ప్రమాదకర పరిస్థితుల్లో ఏమాత్రం బెదరకుండా, తన చాకచక్యంతో ఆ తాచుపాము తలను నేరుగా పైపులోకి దూరేలా చేసి, క్షణాల్లో పాము మొత్తాన్ని ఎంతో సులువుగా పైపులోకి లాగి బంధించాడు. ఈ సాహస వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆ వ్యక్తి ధైర్యానికి ఆశ్చర్యపోతూనే రకరకాల ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
“బ్రదర్.. మీ ఫోన్కు స్వర్గం నుంచి చాలా మిస్డ్ కాల్స్ వచ్చి ఉంటాయి చూసుకోండి!” అంటూ ఒక నెటిజన్ సరదాగా కామెంట్ చేయగా, మరికొందరు ఆ పాము బుసకొట్టిన శబ్దానికే తమ గుండె ఆగిపోయినంత పనైందని పేర్కొన్నారు.
అయితే, భారతదేశంలో అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన తాచుపామును పట్టుకోవడానికి ఇలాంటి ప్రాణాంతకమైన పద్ధతులను అనుసరించడం తీవ్ర ప్రమాదకరమని వన్యప్రాణి నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎవరూ కూడా ఇలాంటి ప్రమాదకరమైన సాహసాలు చేయవద్దని, ఇళ్ల వద్ద లేదా పరిసరాల్లో పాములు కనిపిస్తే వెంటనే శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లను లేదా అటవీ శాఖ అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Leave a Reply