రద్దీగా ఉండే ఓ వ్యాపార కూడలిలో జరిగిన శోభాయాత్ర (ఊరేగింపు) సందర్భంగా పెట్టిన అతి భారీ డీజే సౌండ్ వైబ్రేషన్ల వల్ల.. సమీపంలోని ఓ దుకాణంలో ర్యాకుల్లో ఉంచిన వస్తువులు కిందపడి పగిలిపోయాయి.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ తీవ్ర చర్చకు దారితీసింది. ఆ వీడియోలో భారీ బేస్ సౌండ్ ధాటికి షాపులోని వస్తువులు ఒక్కొక్కటిగా దానంతట అవే కదిలి కిందపడిపోవడం, ఏమీ చేయలేక వ్యాపారి నిస్సహాయంగా కూర్చుని ఉండటం స్పష్టంగా రికార్డైంది.
పండుగ సంబరాల్లో భాగంగా ఈ ఊరేగింపు నిర్వహించినట్లు సమాచారం కాగా, ఇలాంటి మితిమీరిన శబ్ద కాలుష్యం సాధారణ ప్రజలకు, వ్యాపారులకు ఎంతటి ఇబ్బందులను కలిగిస్తుందనే అంశంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యంగా నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు ఉన్న చోట ఇలాంటి హై-డెసిబుల్ డీజే సౌండ్స్‌పై కఠిన ఆంక్షలు విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
అదే సమయంలో, వస్తువులు పడిపోతున్నా ఏమీ పట్టనట్లు కూర్చున్న వ్యాపారి తీరుపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుండగా.. పెళ్లిళ్లు, ఇతర వేడుకల సమయంలో డీజేల వల్ల తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను మరికొందరు పంచుకుంటున్నారు. ప్రజల ప్రశాంతత, సామాజిక భద్రతను కాపాడటానికి శబ్ద కాలుష్యంపై నియంత్రణ తప్పనిసరి అని నెటిజన్లు గళమెత్తుతున్నారు.

Leave a Reply