ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులు హర్యానాలో నివసిస్తుండగా చోటుచేసుకున్న అత్యంత కిరాతక, విచిత్రమైన హత్యోదంతం స్థానికంగా పెను కలకలం రేపింది. భర్తను నరికి చంపి, అతడి పేగులను సంచిలో కుక్కుతున్న భార్య వికృత చేష్టలను చూసి పోలీసులే దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఉత్తరప్రదేశ్లోని తంబూర్ గ్రామానికి చెందిన రాజేష్ (40), విమలా దేవి భార్యాభర్తలు. వివాహమై ఏళ్లు గడుస్తున్నా వీరికి సంతానం కలగలేదు. రాజేష్ హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండటంతో, రింకూ అనే వ్యక్తి ఇంట్లో పై అంతస్తులో అద్దెకు ఉంటున్నారు.
ఈ క్రమంలో సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో రాజేష్ నివసిస్తున్న పోర్షన్ నుంచి ఒక్కసారిగా తీవ్రమైన కేకలు, ఆర్తనాదాలు వినిపించాయి. వెంటనే ఇంటి యజమాని రింకూ పైకి వెళ్లి చూడగా.. రాజేష్ ఒళ్లంతా కత్తిపోట్లతో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. పక్కనే అతని భార్య విమలా దేవి చేతిలో కత్తితో ఆవేశంగా నిల్చుని, హత్యకు గురైన భర్త కడుపులోంచి బయటకు వచ్చిన పేగులను ఒక సంచిలో కుక్కుతూ కనిపించింది. ఈ భయానక దృశ్యాన్ని చూసి రింకూ కేకలు వేయడంతో, తీవ్ర భయాందోళనకు గురైన ఆ మహిళ పైఅంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాజేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పైనుంచి దూకి గాయపడిన విమలా దేవిని ఆసుపత్రికి తరలించారు. రాజేష్ శరీరంపై లెక్కలేనన్ని కత్తిపోట్లు ఉండటంతో పాటు, అతని పొట్టను దాదాపు 35 సెంటీమీటర్ల మేర చీల్చివేశారు. పోస్టుమార్టం నివేదికలో అతని కాలేయంలోని (Liver) ప్రధాన భాగంతో పాటు, కుడి కిడ్నీ కూడా కనిపించకుండా పోయినట్లు తేలింది. ఆ శరీర భాగాలు ఏమయ్యాయనే దానిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
విమలా దేవి నాటు వైద్యం, క్షుద్రపూజలు (మాంత్రికం) చేసేదని సమాచారం ఉండటంతో.. భర్తను నరబలి ఇచ్చి శరీర అవయవాలను ఏమైనా తీసిందా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని కూడా విచారణలో వెల్లడైంది.
ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన విమలా దేవి అపస్మారక స్థితిలో చికిత్స పొందుతుండటంతో, ఆమెకు స్పృహ వచ్చిన తర్వాతే అసలు నిజాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.

Leave a Reply