సరిహద్దులు దాటిన ప్రేమ..! భారతీయ యువకులను పెళ్లాడేందుకు ఎదురుచూస్తున్న పాకిస్తాన్ యువతులు.. వీసాలు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

‘ఆపరేషన్ సిందూర్’ పరిణామాల అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య ఏర్పడిన వీసా, సరిహద్దు రాకపోకల ఆంక్షల కారణంగా.. పాకిస్తాన్‌కు చెందిన పలువురు సింధీ యువతుల వివాహాలు చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చాయి.

ఎన్నో ఏళ్లుగా వాఘా-అటారీ సరిహద్దు మీదుగా భారత్‌కు వచ్చి వివాహాలు జరిపించే సింధ్ ప్రావిన్స్ కుటుంబాలు, గత ఏడాది విధించిన వీసా ఆంక్షల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. దీనివల్ల భారత్‌లోని యువకులతో ఇప్పటికే నిశ్చయమైన అనేక వివాహాలు నిలిచిపోయాయి.

ఈ సమస్యను పరిష్కరించేందుకు రాయ్‌పూర్‌కు చెందిన షదానీ దర్బార్ ఆధ్యాత్మిక గురువు సంత్ యుధిష్ఠిర్‌లాల్ షదానీ చొరవ తీసుకున్నారు. భారత్‌లో వివాహం చేసుకోవడానికి నిరీక్షిస్తున్న పాకిస్తానీ యువతుల జాబితాను సిద్ధం చేసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందజేశారు. దీని ఆధారంగా, కనీసం 150 మంది పాకిస్తానీ యువతులకు, వారి కుటుంబ సభ్యులకు భారత ప్రభుత్వం వీసాలు మంజూరు చేసినట్లు సామాజిక నాయకుడు రాజేష్ జాంబియా తెలిపారు. వీసాలు పొందిన వీరు ప్రస్తుతం దుబాయ్, ఒమన్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాల మీదుగా విమానాల్లో భారత్‌కు చేరుకున్నారు.

ఇలా భారత్‌కు వచ్చిన యువతుల కోసం నాగ్‌పూర్, రాయ్‌పూర్, జోధ్‌పూర్, పూణే నగరాల్లో సుమారు 150 వివాహాలు జరగనున్నాయి; ఇందులో నాగ్‌పూర్‌కు చెందిన 15 కుటుంబాలు కూడా లబ్ధి పొందాయి. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌లో ఇంకా దాదాపు 300 మంది యువతులు భారత్‌లోని తమ కాబోయే భర్తలను పెళ్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వారి పరిస్థితిని కూడా మానవతా దృక్పథంతో పరిశీలించి, వీసాలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *