గత సోమవారం గురుగ్రామ్‌లో కురిసిన భారీ వర్షానికి నగర జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
ముఖ్యంగా, సుభాష్ చౌక్ ప్రాంతంలో స్కూల్ బస్సులు వరద నీటిలో చిక్కుకుపోవడంతో, లోపల ఉన్న పిల్లలు గంటల తరబడి బిక్కుబిక్కుమంటూ గడిపిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. బడా కార్పొరేట్ కంపెనీలు, విలాసవంతమైన భవనాలకు నిలయమైన గురుగ్రామ్ మౌలిక సదుపాయాల నాణ్యత ఈ వర్షంతో మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 75 మి.మీ వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు క్షణాల్లో జలమయమయ్యాయి. అత్యంత దారుణంగా, సుభాష్ చౌక్ ప్రాంతంలో డజనుకు పైగా స్కూల్ బస్సులు లోతైన నీటిలో చిక్కుకుపోయాయి. డ్రైవర్లు, సహాయకులు బస్సు పైకప్పులపైకి ఎక్కేంతగా పరిస్థితి విషమించింది.
స్కూల్ బస్సులు మార్గమధ్యంలోనే నిలిచిపోవడంతో, విద్యార్థులు బస్సుల్లోనే గంటల తరబడి బందీలయ్యారు. తమ పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి, వరదలో చిక్కుకున్న వారిని రక్షించడానికి తల్లిదండ్రులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పాఠశాల నుంచి మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరిన ఒక రెండో తరగతి విద్యార్థి రాత్రి 8:30 గంటలకు గానీ ఇంటికి చేరుకోలేకపోయాడు. మిగిలిన పిల్లలు కూడా బస్సుల్లోనే 3 నుంచి 6 గంటల పాటు నరకయాతన అనుభవించారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ తీవ్ర ట్రాఫిక్ జామ్‌తో స్తంభించాయి.
ఈ దారుణమైన మౌలిక వసతుల వైఫల్యంపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక నెటిజన్, “నెలకు ₹50,000 నుంచి ₹60,000 వరకు ఫీజులు వసూలు చేసే పాఠశాలలను, లగ్జరీ ఇళ్లను కలిపే రోడ్లు మాత్రం మూడో ప్రపంచ దేశాల స్థాయి కంటే దారుణంగా ఉన్నాయి” అంటూ ఘాటుగా స్పందించారు.
విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆగస్టు 25న పాఠశాలలను ఆన్లైన్ ద్వారా నిర్వహించాలని గురుగ్రామ్ జిల్లా యంత్రాంగం ఆదేశించింది. అలాగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, డ్రైనేజీ పునరుద్ధరణ పనులను సులభతరం చేయడానికి ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇవ్వాలని సూచించింది. ఇదిలా ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు పాఠశాలలకు ప్రత్యేక వర్షాకాల సెలవులు ప్రకటించాలని తల్లిదండ్రుల సంఘం డిమాండ్ చేసింది.

Leave a Reply