మహారాష్ట్రలో ఆటో మరియు టాక్సీ డ్రైవర్లందరికీ మరాఠీ భాష మాట్లాడటం తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది.
దీని కారణంగా, మరాఠీ భాష రాకపోవడంతో తన డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందేమోనన్న భయంతో ముంబైకి చెందిన ఒక ఆటో డ్రైవర్ రోడ్డుపైనే బోరున ఏడ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుండి జీవనోపాధి కోసం ముంబైకి వలస వచ్చిన పేద డ్రైవర్లు ఈ నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరాఠీ రాకపోతే 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేయడంతో పాటు, ₹10,000 నుండి ₹15,000 వరకు భారీ జరిమానా విధిస్తారని ప్రచారం జరుగుతుండటంతో.. రోజువారీ సంపాదనపై బతికే తాము అంత పెద్ద మొత్తాన్ని ఎలా కట్టగలమని ఆ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
చదువు అంతగా రాని గ్రామీణ ప్రజలు కేవలం ఒకే నెలలో కొత్త భాషను నేర్చుకోవడం సాధ్యం కాదని, భాష నేర్చుకోవడానికి తమకు సరైన గడువు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. పొట్టకూటి కోసం, కుటుంబ ఆకలి తీర్చడం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తే తనకు కన్నీళ్లే మిగిలాయంటూ అతడు దీనంగా చెప్పిన మాటలు నెటిజన్ల హృదయాలను కలచివేస్తున్నాయి.
ఈ వీడియో వెలుగులోకి వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో భాష, ప్రాంతీయత అంశాలపై తీవ్ర చర్చ మొదలైంది. ఒక రాష్ట్రంలో పనిచేయడానికి ఒక నిర్దిష్ట భాషనే మాట్లాడాలనే నిబంధన విధించడం సాధారణ శ్రామికుల హక్కులను కాలరాయడమేనని, ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్ర రవాణా శాఖ నిబంధనల అమలుపై చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. “మహారాష్ట్ర కేవలం మరాఠీ మాట్లాడే వారికేనా లేక యావత్ భారతదేశానికా?” అంటూ ప్రజలు ముంబై పోలీసులను, ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

Leave a Reply