మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో శుద్ధి చేసిన వంటనూనెను (రిఫైన్డ్ ఆయిల్) తరలిస్తున్న ఒక ట్యాంకర్ లారీ రోడ్డుపై అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదం కారణంగా ట్యాంకర్లో ఉన్న వేలాది లీటర్ల వంటనూనె రోడ్డుపై ఏరులై పారడంతో తీవ్ర కలకలం రేగింది.
ప్రస్తుతం మార్కెట్లో వంటనూనె ధరలు మండుతుండటంతో.. రోడ్డుపై నూనె కారుతుండటం చూసిన స్థానికులు బకెట్లు, క్యాన్లు, బిందెలు మరియు ఇతర పాత్రలతో ఘటనా స్థలానికి పరుగులు తీశారు. రోడ్డుపై పారుతున్న నూనెను ఇళ్లకు తీసుకెళ్లేందుకు ఒకరినొకరు తోసుకుంటూ పోటీ పడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్యాంకర్ నుంచి నూనె కారుతుండగా ప్రజలు ఎగబడటం, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని లాఠీలతో జనాన్ని చెదరగొట్టడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.
రోడ్డుపై పెద్ద ఎత్తున రిఫైన్డ్ ఆయిల్ వృథాగా కొట్టుకుపోవడంతో లారీ యజమానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రమాదానికి గల కారణాలు, ఎవరికైనా గాయాలయ్యాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలోనూ ఇదే తరహాలో డీజిల్ ట్యాంకర్ బోల్తా పడినప్పుడు.. ప్రజలు ప్రమాదాన్ని సైతం లెక్కచేయకుండా డీజిల్‌ను ఎత్తుకెళ్లడం గమనార్హం. మంటలు అంటుకునే తీవ్ర ప్రమాదం పొంచి ఉండటంతో అప్పట్లో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.

Leave a Reply