తమిళనాడు తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపంలోని పచ్చూరు గ్రామానికి చెందిన బట్టల వ్యాపారి కుమార్, సత్య దంపతులకు ఐదుగురు సంతానం.
వీరిలో ఇద్దరు కవలలతో కలిపి ముగ్గురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రోజూలాగే తల్లిదండ్రులు వ్యాపారం ముగించుకుని ఇంటికి చేరుకునే సమయానికి, ఆరేళ్ల కుమారుడు సోమనాథ్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఒక బెలూన్‌ను మింగేశాడు. ఆ బెలూన్ గొంతులో అడ్డుపడటంతో తీవ్రమైన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి బాలుడు స్పృహతప్పి పడిపోయాడు.
ఇంటికి వచ్చి కుమారుడి పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురైన తల్లిదండ్రులు.. వెంటనే బాలుడిని నాట్రంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. శ్వాస ఆడకపోవడంతో బాలుడు ఆసుపత్రికి తీసుకువచ్చేలోపే మరణించినట్లు నిర్ధారించి, గొంతులో ఇరుక్కుపోయిన బెలూన్‌ను బయటకు తీశారు. ఈ హృదయ విదారక ఘటనపై నాట్రంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చిన్నపిల్లలకు బెలూన్లు వంటి వస్తువులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

Leave a Reply