మహారాష్ట్ర ఆర్టీసీ (MSRTC) బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళపై, తప్పతాగి ఉన్న ఒక రౌడీ అత్యంత అనాగరికంగా ప్రవర్తించి, ఆమెపైనే మూత్ర విసర్జన చేసిన హేయమైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని, ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది.
తన చిన్నారి కుమార్తెతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న ఆ మహిళ పట్ల, ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న ఒక అసాంఘిక శక్తీ అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. ఆ మహిళ గట్టిగా ప్రతిఘటించి అతడిని తీవ్రంగా మందలించడంతో, తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ తాగుబోతు రౌడీ హద్దులు దాటి బరితెగించాడు.
సహ ప్రయాణికులు, కండక్టర్ చూస్తుండగానే.. నడుస్తున్న బస్సులోనే ఆ మహిళపై నేరుగా మూత్ర విసర్జన చేసి తన వికృత చేష్టను ప్రదర్శించాడు. కళ్లెదుటే తల్లికి జరిగిన ఈ అమానవీయ ఘోరాన్ని చూసి వెంట ఉన్న చిన్నారి తీవ్ర భయాందోళనకు గురై వణికిపోయింది.
ఈ దుశ్చర్యతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో, బస్సులోని మిగతా ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై ఆ రౌడీని పట్టుకుని దేహశుద్ధి చేసి బంధించారు. ప్రభుత్వ బస్సుల్లోనే మహిళలకు భద్రత కరువైందన్న చేదు నిజాన్ని ఎత్తిచూపుతున్న ఈ దారుణంపై బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మహిళలు సురక్షితంగా ప్రయాణించాల్సిన ప్రభుత్వ బస్సులోనే, అదీ చిన్నారి కళ్ల ముందే జరిగిన ఈ వికృత ఘటన మహారాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.

Leave a Reply