“దానికీ ప్రాణం ఉంటుందిగా.. ఎంతటి కర్కశత్వం!” పార్కులో హెచ్చరిక బోర్డులను బేఖాతరు చేస్తూ అమానుషం.. వైరలవుతున్న షాకింగ్ వీడియో..!!!

చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్, ఫోషాన్ నగరంలో గల చాంగ్‌లూ టూరిజం అండ్ రిసార్ట్ పార్కుకు వచ్చిన ఓ మహిళ, అక్కడున్న ఆఫ్రికన్ స్పర్డ్ జాతికి చెందిన భారీ సజీవ తాబేలుపై చంటిబిడ్డను ఎత్తుకుని ఎక్కి నిలబడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

సందర్శకులు ఎవరూ తాబేళ్లపై ఎక్కరాదని స్పష్టంగా హెచ్చరిక బోర్డులు పెట్టినప్పటికీ, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ మహిళ ప్రవర్తించింది. అంతేకాకుండా, పక్కనే ఉన్న మరో బాలుడిని కూడా తాబేలుపై ఎక్కాలంటూ ప్రోత్సహించింది.

ఆ బరువును మోయలేక ఆ మూగజీవం విలవిల్లాడుతూ కదలడానికి ప్రయత్నిస్తుంటే, అది చూసి ఆ మహిళ మరింత ఆనందంతో నవ్వుతూ కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, అక్కడే ఉన్న సిబ్బంది ఎవరూ వెంటనే ఆ చర్యను అడ్డుకోకపోవడంపై పార్కు యాజమాన్య భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వ్యవహారం పార్కు అధికారుల దృష్టికి వెళ్లడంతో, వెంటనే పశువైద్యులను పిలిపించి ఆ తాబేలుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ తాబేలు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించారు. అయితే, తాబేలు పైకవచం కేవలం పైతోలు మాత్రమే కాదని, అది వాటి వెన్నెముక మరియు నాడీ వ్యవస్థతో అనుసంధానమై ఉంటుందని నిపుణులు హెచ్చరించారు. మనుషుల అధిక బరువు వాటి అంతర్గత అవయవాలు, ఎముకలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *