“కళ్లను కప్పేసిన మోహం”.. ప్రియుడితో రాసలీలలు.. భర్తకు తెలిసిన నిజం.. గొయ్యి తీసి పూడ్చిపెట్టి మొక్కలు నాటిన కిరాతక భార్య.. 24 గంటల్లోనే ఎలా దొరికిపోయారు..?

హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ సమీపంలోని మోజాబాద్ గ్రామంలో 42 ఏళ్ల వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది.

శ్యామ్‌వీర్ అనే వ్యక్తి మృతదేహం ఆయన ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో పాతిపెట్టిన స్థితిలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య కేశవ్, ఆమెతో వివాహేతర సంబంధం ఉన్న కామత్ అనే మరో వ్యక్తిని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 24న అందిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని వెలికితీసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. కామత్ అనే వ్యక్తి శ్యామ్‌వీర్‌తో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తుండేవాడు. ఆ క్రమంలో అతనికి, శ్యామ్‌వీర్ భార్యకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయం శ్యామ్‌వీర్‌కు తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో వారిద్దరూ కలిసి శ్యామ్‌వీర్‌ను అంతమొందించేందుకు పథకం రచించారు. ఆగస్టు 16న ఈ ఘాతుకానికి పాల్పడిన అనంతరం, మృతదేహాన్ని ఇంటి పక్కనే ఉన్న గొయ్యిలో పూడ్చిపెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఇంతలో, శ్యామ్‌వీర్ కనిపించకుండా పోవడంపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. శ్యామ్‌వీర్ తనతో గొడవపడి ఎక్కడికో వెళ్లిపోయాడని భార్య బంధువులకు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన బంధువులు ఆయన ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మట్టి తవ్వి, దానిపై మొక్కలు వేసి ఉండటాన్ని వారు గమనించారు. మరింత అనుమానం వచ్చి ఆ స్థలాన్ని తవ్వి చూడగా శ్యామ్‌వీర్ మృతదేహం బయటపడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఉన్నతాధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. శ్యామ్‌వీర్ సోదరుడు రాంవీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు. క్రైమ్ బ్రాంచ్ (డీఎల్‌ఎఫ్) బృందం దర్యాప్తును ముమ్మరం చేసి, ఘటన జరిగిన 24 గంటల్లోనే భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుంది. ఇద్దరినీ కోర్టులో హాజరుపరచనున్నామని, హత్య వెనుక ఉన్న పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *