తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలో, కన్నతల్లినే కొడుకు కదులుతున్న రైలు కిందకు తోసి దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
వృద్ధాప్య సమస్యలతో చక్రాల కుర్చీ (వీల్‌చైర్)కే పరిమితమైన కన్నతల్లిని.. ఏమాత్రం కనికరం లేకుండా రైల్వే ట్రాక్‌పైకి తోసేసిన ఈ అమానుష ఘటన స్థానికులలో తీవ్ర విషాదాన్ని, ఆగ్రహాన్ని నింపింది.
ఈ ఘాతుకానికి పాల్పడింది మరణించిన వృద్ధురాలు పద్మావతి కొడుకు పార్థసారథిగా గుర్తించారు. ఆ వృద్ధురాలు తనకు వచ్చే పెన్షన్ డబ్బులతో కొడుకులతో కలిసి జీవిస్తోంది. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతుండగా.. రోగగ్రస్తురాలైన తల్లిని నిరంతరం చూసుకోవడం భారంగా భావించిన పార్థసారథి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ (CCTV) కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వెంటనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో.. తల్లి వైద్య ఖర్చులు, ఆమె సంరక్షణ భారాన్ని భరించలేకనే గుడికి తీసుకెళ్తున్నానని చెప్పి నమ్మించి, కదులుతున్న రైలు కిందకు నెట్టి చంపేశానని పార్థసారథి నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు చేపట్టారు.

Leave a Reply