మదురై జిల్లా వరిచ్చియూర్ మేట్టుపట్టి ప్రాంతానికి చెందిన అయ్యమ్మాళ్, ఆమె కుమారుడు రాజా (32) ఇద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. రాజా తీవ్రమైన మద్యపానానికి బానిసై తరచూ ఇంట్లో గొడవలు పడేవాడు.
ఈ కారణంతో అతని భార్య, పిల్లలు అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. సరైన పనులకు వెళ్లకుండా తిరుగుతున్న అతనిపై పలు నేరపూరిత కేసులు కూడా నమోదై ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో, దాదాపు మూడు నెలల క్రితం ఎప్పటిలాగే విపరీతమైన మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రాజా, మద్యం తాగేందుకు ఇంకా డబ్బులు కావాలని తల్లిని బెదిరించాడు. ఆమె డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో, కన్నతల్లి అని కూడా చూడకుండా ఆమెపై అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురైన అయ్యమ్మాళ్.. పక్కనే ఉన్న ఇనుప రాడ్తో రాజా తలపై బలంగా కొట్టింది. ఈ దాడితో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన రాజా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
కుమారుడిని హత్య చేసిన విషయాన్ని దాచేందుకు, ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణం కోసం తవ్విన గుంతలో అతని మృతదేహాన్ని వేసి మట్టితో పూడ్చిపెట్టింది. అనంతరం ఆధారాలు దొరక్కుండా రక్తపు మరకలను శుభ్రంగా తుడిచేసింది.
తన కొడుకు కనిపించడం లేదని ఊరిలో నాటకమాడుతూ వచ్చిన ఆమె.. రోజులు గడుస్తున్న కొద్దీ గ్రామస్థులకు అనుమానం రావడం, విషయం బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడటంతో గ్రామ పరిపాలనాధికారి (VAO) వద్దకు స్వయంగా వెళ్లి లొంగిపోయింది. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

Leave a Reply