నేపాల్‌లో సంభవించిన భీకర ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటివరకు 270 మంది ప్రాణాలు కోల్పోగా.. వరద నీటిలో కొట్టుకొచ్చిన మృతదేహాల నుంచి ఒక ముఠా బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న గుండెలు పిండేసే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
తమ బంధువులను, ఆత్మీయులను కోల్పోయి ప్రజలు కన్నీరుమున్నీరవుతున్న సమయంలో చోటుచేసుకున్న ఈ అమానవీయ చర్య అందరినీ తీవ్ర వేదనకు గురిచేసింది.
నేపాల్ – టిబెట్ సరిహద్దులో ప్రవహించే భోటేకోషి నదిలో సంభవించిన వరద ప్రళయానికి నువాకోట్, ధాడింగ్, రసువా తదితర జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, వాహనాలు, వంతెనలు వరద నీటిలో కొట్టుకుపోవడమే కాకుండా, కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లిన భక్తులు, జలవిద్యుత్ ప్రాజెక్టు కార్మికులతో సహా అనేకమంది వరద ప్రవాహంలో గల్లంతయ్యారు.
ఈ వరదల్లో 500 మందికి పైగా గల్లంతవగా, వీరిలో 288 మంది భారతీయులు కూడా ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు వరదల్లో చిక్కుకోగా, రెస్క్యూ సిబ్బంది ముమ్మర చర్యలు చేపట్టి తమిళనాడుకు చెందిన 21 మందిని ఇప్పటివరకు సురక్షితంగా రక్షించారు. గల్లంతైన మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక వీడియోలో.. వరద నీటిలో కొట్టుకొచ్చిన ఒక మహిళ మృతదేహాన్ని జుట్టు పట్టుకుని ఒడ్డుకు లాక్కొచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఆమె శరీరంపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్తున్న అత్యంత కిరాతక దృశ్యాలు కనిపించాయి. చుట్టూ ఉన్న ప్రజలు నిస్సహాయంగా చోద్యం చూస్తుండగానే జరిగిన ఈ ఘటన నెట్టింట తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు.. “చనిపోయిన మహిళ మృతదేహాన్ని గౌరవంగా బయటకు తీయకుండా కేవలం నగలను మాత్రమే దొంగిలించడం ఏ రకమైన మానవత్వం?” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఘోరానికి ఒడిగట్టిన వారిని వెంటనే గుర్తించి నేపాల్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply