కన్నతల్లి గర్భం లోకానికి వెలుగునిచ్చే మరో రూపం అంటారు. కానీ, అదే తల్లి చేతులతోనే కన్న కొడుకు ప్రాణం తీసిన ఒక దారుణ ఘటన మధురై జిల్లాలో చోటుచేసుకుంది.
మత్తుకు బానిసై, కన్నతల్లినే వేధింపులకు గురిచేస్తున్న కొడుకును.. తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన ఆ తల్లే కొట్టి చంపి పాతిపెట్టిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మధురై జిల్లా వరిచ్చియూర్ మేట్టుపట్టి ప్రాంతానికి చెందిన అయ్యమ్మాళ్ కుమారుడు రాజా (32). ఇతనికి తీవ్రమైన మద్యపానం, మత్తు పదార్థాల అలవాటు ఉంది. మత్తు తలకెక్కిన స్థితిలో రాజా చేసే అరాచకాలకు తాళలేక అతని భార్యాపిల్లలు ఎప్పుడో అతడిని వదిలేసి వెళ్లిపోయారు. అంతేకాకుండా అతనిపై పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. కుటుంబాన్ని వదిలేసినప్పటికీ, కన్నతల్లి అయిన అయ్యమ్మాళ్ను నిరంతరం వేధింపులకు గురిచేసేవాడు.
మూడు నెలల క్రితం, యథావిధిగా తీవ్రమైన మత్తులో ఇంటికి వచ్చిన రాజా.. తల్లి అయ్యమ్మాళ్ను డబ్బుల కోసం బెదిరించాడు. అంతటితో ఆగకుండా ఆమెపై అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడు. కళ్లెదుటే పెరిగిన కొడుకే తన పట్ల ఇలా ప్రవర్తించడం చూసి తట్టుకోలేకపోయిన అయ్యమ్మాళ్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
ఆత్మరక్షణ కోసం ఆవేశానికి లోనైన ఆమె.. రాజాను కిందకు నెట్టేసి, పక్కనే ఉన్న ఇనుప రాడ్తో అతని తలపై బలంగా కొట్టింది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన రాజా రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
కన్నకొడుకు చనిపోవడంతో భయాందోళనకు గురైన అయ్యమ్మాళ్ ఆ నిజాన్ని కప్పిపుచ్చేందుకు పన్నాగం పన్నింది. ఇంటి సమీపంలో టాయిలెట్ (మరుగుదొడ్డి) నిర్మాణం కోసం తవ్విన గుంతలో రాజా మృతదేహాన్ని పడేసి పూడ్చిపెట్టింది. అనంతరం ఇంట్లోని రక్తపు మరకలను, ఆధారాలను పూర్తిగా తుడిచి శుభ్రం చేసింది.
“నా కొడుకు ఎక్కడికో వెళ్లిపోయాడు” అంటూ గత కొద్ది నెలలుగా ఊరిలో నాటకమాడింది. అయితే పోలీసుల నిఘా, గ్రామస్థుల అనుమానాల వల్ల అయ్యమ్మాళ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఎలాగూ పోలీసుల చేతికి చిక్కక తప్పదని గ్రహించి, నిన్న గ్రామ పరిపాలనాధికారి (VAO) ఎదుట స్వయంగా లొంగిపోయి, తాను చేసిన నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటన మధురై ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Leave a Reply