ముంబై పోలీసుల పెట్రోలింగ్ వాహనంలోకి అక్రమంగా చొరబడి, డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియో రూపొందించిన ఒక వ్యక్తి నిర్వాకం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపింది.
విజయ్ హరిజన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వాటర్‌మార్క్‌తో విడుదలైన ఈ వీడియోలో, అతను పోలీస్ శాఖకు చెందిన ఎస్‌యూవీ (SUV) వాహనం డ్రైవర్ సీట్లో కూర్చొని పోజులివ్వడం, బ్యాక్‌గ్రౌండ్‌లో “డాడీస్ హోమ్” అనే పాట వినిపించడం కనిపిస్తుంది.
సాధారణ పౌరులు ఎవరూ సులభంగా వెళ్లలేని పోలీస్ వాహనంలోకి ఒక సామాన్య వ్యక్తి ఎలా ప్రవేశించాడు, అతనికి ఎలా అనుమతి లభించింది అనే విషయాలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ రీల్స్ వీడియోను వెంటనే తొలగించినట్లు సమాచారం ఉన్నప్పటికీ.. ఇది ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనే దానిపై అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
గతంలో ముంబై కోస్టల్ రోడ్డులో జరిగిన వాహనాల దొంగతనం, భద్రతా వైఫల్యాల వివాదాల కొనసాగింపుగానే ప్రస్తుత ఘటనను కూడా చూస్తున్నారు. పోలీసుల భద్రతా వాహనాలను కొందరు వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రచారం కోసం, సోషల్ మీడియా పాపులారిటీ కోసం ఇలా నిరంతరం దుర్వినియోగం చేస్తుండటం ముంబై వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలో సదరు వ్యక్తిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply