“ఆ ఫోన్ ఒక్కటి కొనివ్వమ్మా..”: ఆశగా అడిగిన కూతురు.. తల్లి పరిస్థితి అనుకూలించకపోవడంతో ఇంట్లో గొడవ.. తీవ్ర విషాదంలో ముగిసిన వివాదం.. దిగ్భ్రాంతిలో కుటుంబం.!!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనివ్వాలని తల్లిని పదేపదే కోరుతూ వచ్చిన 9వ తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

15 ఏళ్ల ఆ విద్యార్థిని, తన స్నేహితులు వాడుతున్నట్లుగానే ఖరీదైన ఫోన్ తనకు కూడా కావాలని తల్లిని కోరినట్లు సమాచారం. అయితే, ఆమె తల్లి దినసరి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండటంతో ఆ ఖరీదైన మొబైల్ కొనివ్వలేని ఆర్థిక పరిస్థితిలో ఉంది. ఈ విషయమై తల్లికూతుళ్ల మధ్య గత కొన్ని రోజులుగా మనస్పర్థలు, వాగ్వాదాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో గురువారం నాడు ఫోన్ కొనుగోలు విషయంపై వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. అనంతరం ఆ బాలిక తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, ఆమె ప్రాణాపాయ స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

సదరు విద్యార్థిని తన తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తున్నట్లు సమాచారం. తల్లిదండ్రుల మధ్య తలెత్తిన కుటుంబ కలహాల కారణంగా, తల్లి తన పిల్లలతో కలిసి వేరుగా ఉంటోంది. ఖరీదైన ఫోన్ కావాలన్న బాలిక కోరికకు, కుటుంబ ఆర్థిక పరిస్థితికి మధ్య తలెత్తిన ఘర్షణే ఈ విషాదానికి దారితీసినట్లు ప్రాథమికంగా తెలిసినా.. పూర్తి స్థాయి కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి సమగ్ర విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. ఒక చిన్న స్మార్ట్‌ఫోన్ కోసం జరిగిన వివాదం ఇంతటి ఘోర విషాదానికి దారితీయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పిల్లలు, టీనేజర్ల మానసిక స్థితిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన తెలియజేస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *