న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన వ్యాపారవేత్త షఫ్కత్ మక్బూల్.. మహిళల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత, ఏకాంత క్షణాలను రహస్యంగా చిత్రీకరించి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసిన కేసులో స్థానిక కోర్టు అతనికి 31 నెలల జైలు శిక్ష విధించింది.
తనపై నమోదైన 24 నేరారోపణలను నిందితుడు న్యాయస్థానంలో అంగీకరించడంతో ఈ శిక్ష ఖరారైంది. వీటిలో 14 ఆరోపణలు అనుమతి లేకుండా రహస్య వీడియోలు చిత్రీకరించినందుకు సంబంధించినవి కాగా, మరో 10 ఆరోపణలు ఆ వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేసినందుకు సంబంధించినవని వెల్లడైంది. గత నాలుగేళ్లుగా ఈ అకృత్యాలు సాగినట్లు కోర్టు విచారణలో తేలింది. ఆక్లాండ్ జిల్లా న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా బాధితులు ఎదుర్కొన్న తీవ్ర పరిణామాలను సమగ్రంగా వివరించారు.
వివరాల్లోకి వెళితే.. మహిళలతో ఏకాంతంగా గడిపే సమయంలో ఆ దృశ్యాలను రహస్య కెమెరాల ద్వారా వీడియోలు తీసి పోర్న్/ఆన్లైన్ వెబ్సైట్లలో అప్లోడ్ చేశాడు. బాధితులకు ఏమాత్రం తెలియకుండా రహస్య రికార్డింగ్ పరికరాలను ఉపయోగించినట్లు, వాటి ద్వారా 3,521 న్యూజిలాండ్ డాలర్ల మేర ఆదాయం ఆర్జించినట్లు కోర్టు రికార్డులు వెల్లడించాయి. ఈ చర్యల వల్ల బాధిత మహిళలు తీవ్ర మానసిక క్షోభను, ఆందోళనను ఎదుర్కొన్నారని న్యాయమూర్తి డెబ్రా బెల్ పేర్కొన్నారు. ఇంటర్నెట్లో అప్లోడ్ అయిన వీడియోలను పూర్తిగా తొలగించడం సాధ్యమేనా అనే భయం బాధితులను వెంటాడుతోందని కోర్టు దృష్టికి వచ్చింది. నిందితుడి చర్యల్లో బాధితుల ఆత్మగౌరవం పట్ల ఏమాత్రం గౌరవం లేదని న్యాయమూర్తి తీవ్రంగా వ్యాఖ్యానించారు.
బాధిత మహిళల్లో కొందరు కోర్టులో తమ వాంగ్మూలాలను సమర్పిస్తూ.. తమ ప్రమేయం లేకుండా వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమైనప్పుడు తీవ్ర దిగ్భ్రాంతికి, భయాందోళనలకు గురయ్యామని తెలిపారు. ఈ వ్యవహారం తమ వ్యక్తిగత జీవితాన్నే కాకుండా వృత్తిపరమైన జీవితాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల మానసిక వేదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నేర తీవ్రతను బట్టి ఈ తీర్పును వెలువరించింది.
విచారణ ముగింపులో నిందితుడు బాధితులకు క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెందుతున్నట్లు నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనుమతి లేకుండా ఇతరుల ఏకాంతాన్ని, వ్యక్తిగత గోప్యతను (Privacy) రహస్యంగా చిత్రీకరించడం, దానిని ఇంటర్నెట్లో విడుదల చేయడం తీవ్రమైన నేరమని, దీనివల్ల కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది.

Leave a Reply