సాంకేతికత కనుమరుగైన వేళ, కెనడాకు చెందిన ఓ తల్లి ఆటిజంతో బాధపడుతున్న తన కొడుకు కోసం చూపిన వినూత్న పరిష్కారం ప్రపంచవ్యాప్తంగా ఎందరినో ఆకట్టుకుంటోంది.
జెసికా ఫ్లెచర్ (Jessica Fletcher) తన 11 ఏళ్ల కుమారుడు హంటర్‌తో (Hunter) కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ హంటర్ మాట్లాడేందుకు ఉపయోగించే ‘AAC’ (ఆగ్మెంటేటివ్ అండ్ ఆల్టర్నేటివ్ కమ్యూనికేషన్) ఎలక్ట్రానిక్ పరికరం బ్యాటరీ పూర్తిగా అయిపోయింది. మాట్లాడే సామర్థ్యం లేని హంటర్‌కు తన భావాలను వ్యక్తపరచడానికి ఆ డివైజ్ మాత్రమే ఏకైక ఆధారం. అయితే, ఏమాత్రం కంగారు పడని ఆ బాలుడు, అక్కడే ఉన్న పేపర్ నాప్కిన్పై కీబోర్డ్ గీసి, అందులోని అక్షరాలను వేలితో చూపిస్తూ ఫుడ్ ఆర్డర్ చేశాడు.
కుమారుడి సమయస్ఫూర్తిని చూసి ఆశ్చర్యపోయిన జెసికా, టెక్నాలజీ ಕೈఇచ్చినప్పుడు ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచించింది. వెంటనే ఓ టాటూ ఆర్టిస్ట్‌ను సంప్రదించి, తన ముంజేతిపై కీబోర్డ్ నమూనాను శాశ్వత పచ్చబొట్టుగా (Tattoo) వేయించుకుంది. అందులో అక్షరాలతో పాటు సంతోషం, బాధ వంటి ఎమోజీలు, “ఐ లవ్ యూ” బటన్ కూడా ఉన్నాయి. చేతిపై ఉన్న ఆ టచ్‌స్క్రీన్ లాంటి టాటూను చూసిన వెంటనే హంటర్, ఆ అక్షరాలను తాకుతూ మొదటి పదంగా “మామా” (Mama) అని టైప్ చేసి తల్లిని ఆనందబాష్పాల్లో ముంచెత్తాడు.
ఈ కీబోర్డ్ టాటూ కేవలం అత్యవసర సాధనంగా మాత్రమే కాకుండా, హంటర్‌కు వ్యక్తిగత గోప్యతను (Privacy) కూడా అందిస్తోంది. సాధారణ AAC డివైజ్‌లు బిగ్గరగా శబ్దం చేస్తూ మాట్లాడతాయి కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో నలుగురి దృష్టి వారిపై పడుతుంది. కానీ, తల్లి చేతిపై ఉన్న ఈ కీబోర్డ్ ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మాట్లాడుకోగలుగుతున్నారు. జెసికా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో 20 లక్షలకు పైగా లైక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయ్యింది.
ఈ చిన్న ఆలోచన ఇప్పుడు సరికొత్త మార్పుకు దారితీసింది:
- కీబోర్డ్ దుస్తులు: హంటర్‌తో సులభంగా మాట్లాడాలని అతని స్కూల్ మిత్రులు కోరడంతో, చొక్కా చేతులపై (Sleeves) కీబోర్డ్ ప్రింట్ చేసిన ప్రత్యేక దుస్తులను రూపొందించారు.
- వైద్యుల ఆసక్తి: పారామెడికల్ సిబ్బంది, వైద్యులు మరియు ఇతర ఆటిజం పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ విధానాన్ని అనుసరించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
“కమ్యూనికేషన్ అడ్డంకులను తొలగించినప్పుడే మాట్లాడలేని వ్యక్తులు తమ నిజమైన భావాలను ప్రపంచానికి చాటగలరు” అని చెబుతున్న జెసికా, తన కొడుకు గొంతు ఎప్పటికీ మూగబోకూడదనేదే తన తపన అని పేర్కొంది.

Leave a Reply