బెంగళూరు సమీపంలోని కగ్గలిపురకు చెందిన కె.డి. కెంపమ్మ అనే మహిళ, పేదరికం నుంచి త్వరగా ధనవంతురాలు కావాలనే దురాశతో నేరాల బాట పట్టింది.
ప్రారంభంలో చిట్ఫండ్ వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధలు ఆమెను ఇల్లు విడిచి వెళ్లేలా చేశాయి. ఆ తర్వాత నగల తయారీ దుకాణాల్లో పనిచేస్తున్న సమయంలో, బంగారాన్ని మెరిపించేందుకు ఉపయోగించే ‘పొటాషియం సైనైడ్’ విషం యొక్క తీవ్రతను తెలుసుకుంది.
గతంలో ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన ఆమె, బయటకు వచ్చిన తర్వాత తన రూపురేఖలను మార్చుకుని ‘సైనైడ్ మల్లిక’గా మారి వరుస నేరాలకు తెరలేపింది.
కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయి గుళ్లకు వచ్చే మహిళలనే మల్లిక తన వలలో వేసుకునేది. వారికి ప్రత్యేక పూజలు చేస్తే కష్టాలన్నీ తీరిపోతాయని నమ్మించి, ఒంటిపై ఉన్న నగలన్నీ ధరించి నిర్మానుష్య ప్రదేశాలకు రావాలని చెప్పేది.
అలా వచ్చిన మమతా రాజన్ అనే మహిళను తన మొదటి టార్గెట్గా మార్చుకున్న ఆమె, పూజ అనంతరం తీర్థం పేరుతో సైనైడ్ కలిపిన విషాన్ని తాగించి హత్య చేసింది. ఆ తర్వాత వారి ఒంటిపై ఉన్న బంగారు నగలతో ఉడాయించడం అలవాటుగా మార్చుకుంది.
1999 నుంచి 2007 మధ్య కాలంలో, సంతానం లేక లేదా కుటుంబ కలహాలతో బాధపడుతున్న పిళ్ళమ్మ, నాగలక్ష్మి సహా సుమారు ఆరుగురు మహిళలను మల్లిక ఇదే పద్ధతిలో అంతమొందించింది.
భక్తి ముసుగులో అమాయక మహిళల ప్రాణాలను తీసి, నగల కోసం రక్తమోర్చిన ఈ సైనైడ్ మల్లిక అకృత్యాలు ఆ సమయంలో కర్ణాటక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి.

Leave a Reply