మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూరు ప్రాంతంలో, ప్రియురాలి ప్రవర్తనపై అనుమానంతో గర్భిణి అయిన యువతిని విషమిచ్చి హతమార్చిన దారుణ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
19 ఏళ్ల విష్ణుమాయ అనే యువతి సుమారు రెండున్నర నెలల గర్భవతి. ఆమె ప్రియుడు, 25 ఏళ్ల ఆశిష్ మగర్.. విష్ణుమాయ వేరొక స్నేహితుడితో మాట్లాడటం చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు. దీనివల్ల వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగి, చివరికి ఈ ఘోర హత్యకు దారితీసింది.
గొడవ తర్వాత అంతా సద్దుమణిగినట్లు నటించిన ఆశిష్, ప్రియురాలికి విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు. అందులో విషం ఉన్న విషయం తెలియని విష్ణుమాయ దానిని తాగేసింది. కొద్ది నిమిషాల్లోనే ఆమెకు తీవ్రంగా వాంతులు మొదలై ఆరోగ్యం విషమించింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది.
ప్రారంభంలో పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే, పోస్ట్‌మార్టం నివేదికలో శరీరంలోకి విషం చేరినట్లు తేలడంతో, దీనిని హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. మరణించే ముందు ఆశిష్ ఇచ్చిన కూల్‌డ్రింక్ తాగినట్లు విష్ణుమాయ చెప్పిన వివరాల ఆధారంగా ఆశిష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతను పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతనికి 5 రోజుల పోలీసు కస్టడీ విధించడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply