మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ ప్రమాదవశాత్తు జారిపడగా, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దూకి కాపాడిన ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది.
తన సోదరుడికి రాఖీ కట్టి తిరిగి ఊరికి వెళ్లే సమయంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
శివపురి జిల్లాకు చెందిన 36 ఏళ్ల మహిళ అశోక్‌నగర్ వెళ్లేందుకు శివపురి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో అప్పటికే ప్లాట్‌ఫామ్ దాటి నెమ్మదిగా కదులుతున్న రైలును ఎక్కేందుకు ఆమె ప్రయత్నించారు. దురదృష్టవశాత్తూ ఆమె కాలు జారడంతో అదుపుతప్పి రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ప్రమాదకరమైన ఖాళీ ప్రదేశంలో పడి కొన్ని అడుగుల మేర ఈడ్చుకెళ్లబడ్డారు.
అదే సమయంలో ప్లాట్‌ఫామ్‌పై గస్తీ తిరుగుతున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వీరేంద్ర కుమార్ తివారీ పరిస్థితి తీవ్రతను వెంటనే గ్రహించారు. ఆ మహిళ రైలు ఎక్కే క్రమంలోనే ఆమె కదలికలను గమనించి దగ్గరకు వెళ్తున్న ఆయన, ఆమె పట్టాల మధ్య పడిపోగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను బలంగా పట్టుకుని బయటకు లాగారు. దీంతో ఆ మహిళ రైలు చక్రాల కింద పడకుండా తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు కానిస్టేబుల్ వీరేంద్ర కుమార్ తివారీ ధైర్యాన్ని, సత్వర స్పందనను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నారు.
ఈ ఘటన అనంతరం కానిస్టేబుల్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. “ప్రయాణికులు ఎప్పుడూ ఇలాంటి ప్రమాదకరమైన పనులకు పాల్పడకూడదు. కదులుతున్న రైలు ఎక్కడానికి లేదా దిగడానికి ప్రయత్నించడం ప్రాణాలకే ముప్పు. ప్రయాణాల్లో కాస్త అప్రమత్తత, సంయమనం పాటిస్తే ఇలాంటి ప్రమాదాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు” అని హెచ్చరిస్తూ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply