నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల సంభవించిన పెను వరదల్లో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
వేలాది మంది గల్లంతయ్యారని, వారిలో పర్యాటకులు కూడా ఉన్నారని సమాచారం. పరిస్థితి విషమించడంతో భారత సైనిక విమానాల ద్వారా ఆహారం, మందులను అక్కడికి పంపించారు.
ఈ పరిస్థితుల్లో, నేపాల్ వరదల్లో ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలను రక్షించుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ అందరినీ కలచివేస్తోంది. స్కూల్ యూనిఫామ్‌లో నిలబడి ఉన్న కుమార్తెలను చూసిన ఆ తల్లి, క్షణకాలం కూడా ఆలోచించకుండా వేగంగా దూసుకొస్తున్న వరద ఉధృతిని గమనించి వారిని తీసుకుని పరుగు తీసింది.
ఆ సమయంలో రోడ్డుపై కాలు జారి కింద పడినప్పటికీ, వెంటనే సమయస్ఫూర్తితో లేచి, ఇద్దరు పిల్లల చేతులను గట్టిగా పట్టుకుని పర్వతం వైపునకు పరుగెత్తి ప్రాణాలను కాపాడుకుంది. కేవలం 2 సెకన్లు ఆలస్యమైనా పెను ప్రమాదం జరిగి ఉండేదని, ఆ తల్లి చూపిన ధైర్యసాహసాలను నెటిజన్లు వేనోళ్ల పొగుడుతున్నారు.
మరొక వీడియోలో, చుట్టుపక్కల ఉన్న ఇళ్లన్నీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయినప్పటికీ, చెక్కుచెదరకుండా నిలిచిన ఒక ప్రసిద్ధ రెండంతస్తుల ఆకుపచ్చ రంగు ఇంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. చుట్టూ వరద నీరు ముంచెత్తినప్పటికీ, ఆ ఇంట్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా రక్షించాయి.
ప్రకృతి ప్రకోపానికి నేపాల్ అంతటా బురదమయంగా మారిన వేళ, ఈ రెండు వీడియోలు అక్కడ సంభవించిన పెను విపత్తు తీవ్రతను ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి.

Leave a Reply