సుప్రీంకోర్టులో దక్కిన చారిత్రక విజయం అనంతరం, ‘కోకరోచ్ జనతా పార్టీ’ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే తన తొలి స్పందనను పంచుకున్నారు.
ఆందోళనల్లో పాల్గొన్న సీజేపీ (CJP) కార్యకర్తలపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
దాదాపు నెల రోజుల నిరసనల అనంతరం వచ్చిన ఈ తీర్పుపై అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. “ఈ విజయం మీ అందరికీ చెందుతుంది. మీరే గళమెత్తారు, మీ వల్లే మనకు న్యాయం దక్కింది” అని పేర్కొంటూ కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీ ఆందోళనలతో సహా దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5వ తేదీన చేపట్ట తలపెట్టిన ఆందోళనను విరమిస్తున్నట్లు దీప్కే ప్రకటించారు.
విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయడం, బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం వంటి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించని క్రమంలో కోర్టు ద్వారా న్యాయం లభించిందని తెలిపారు. ఈ నిరసనల సెగతోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని కూడా ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం, మరణించిన విద్యార్థుల కుటుంబ సభ్యులతో అభిజిత్ దీప్కే ఫోన్‌లో మాట్లాడి వారిని పరామర్శించారు. వారి ప్రాణ నష్టాన్ని ఏదీ పూడ్చలేనప్పటికీ, సీజేపీ ఉద్యమం ఎల్లప్పుడూ ఆ కుటుంబాలకు అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

Leave a Reply