నేపాల్‌లోని నువాకోట్ జిల్లాలో కుండపోతగా కురిసిన భారీ వర్షాల కారణంగా త్రిశూలి నదిలో మునుపెన్నడూ లేని రీతిలో భీకర వరదలు సంభవించాయి.
తీరాలను తెంచుకుని ఉగ్రరూపంతో విరుచుకుపడిన ఈ వరద నీరు.. ఆ ప్రాంతంలో ఉన్న అత్యాధునిక బహుళ అంతస్తుల భవనాలు, వాహనాలు, ప్రజల ఆస్తులను రెప్పపాటు కాలంలో తుడిచిపెట్టేసింది.
ఈ విధ్వంసకర విలయం నడుమ ప్రకాష్ అనే వ్యక్తికి చెందిన 40 ఏళ్ల నాటి ఒక చిన్న ఆకుపచ్చ ఇల్లు మాత్రం చెక్కుచెదరని ధైర్యంతో ఎలాంటి నష్టం లేకుండా సురక్షితంగా నిలబడింది. ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తీవ్ర విస్మయానికి గురయ్యారు.
వరద చుట్టుముట్టిన ఆ భయానక క్షణాల గురించి మీడియాకు వివరించిన ఇంటి యజమాని ప్రకాష్.. వరద నీటి మట్టం పెరిగి ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌ను ముంచెత్తినప్పుడు తాము అనుభవించిన భయోత్పాతాన్ని పంచుకున్నారు. “ఇదే మా జీవితంలో చివరి క్షణం అనుకున్నాం; ఇక మేము ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదని భావించాం” అని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.
పరిస్థితి తీవ్రతను గ్రహించిన కుటుంబ సభ్యులు వెంటనే ఇంటి పైఅంతస్తుకు పరుగులు తీశారు. తమ చుట్టూ ఉగ్రరూపంతో వరద నీరు ప్రవహిస్తుండగా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గంటల తరబడి బిక్కుబిక్కుమంటూ గడిపారు.
చుట్టుపక్కల ఉన్న ఆధునిక భవనాలన్నీ కొట్టుకుపోయినప్పటికీ, దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ చిన్న ఇల్లు ఎలా నిలబడగలిగింది అనే అంశంపై వాస్తుశిల్ప, ఇంజనీరింగ్ నిపుణులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఆ భవన నిర్మాణ పునాది దృఢత్వం, దాని ఆకృతి వరద తీవ్రతను తట్టుకునేలా ఉన్నాయని తేలింది. అలాగే, ఈ ఇల్లు ప్రధాన వరద ప్రవాహ మార్గానికి కాస్త పక్కగా ఉండటమే అది కూలిపోకుండా బతికిపోవడానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వరద ఉధృతి కాస్త తగ్గిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. ఇంటి పైకప్పుపై నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా రక్షించి పునరావాస శిబిరాలకు తరలించాయి. పెను విపత్తులోనూ ఒక కుటుంబం అద్భుత రీతిలో ప్రాణాలతో బయటపడిన ఈ ఉదంతం, వరదలతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్ ప్రజల్లో సరికొత్త ఆశను, ఊరటను నింపింది.

Leave a Reply