పంజాబ్ రాష్ట్రంలోని తరన్ తారన్ జిల్లాలో, ప్రేమ వివాహం చేసుకున్న జగజిత్ సింగ్ అనే 20 ఏళ్ల యువకుడిని అతని ఇద్దరు బావమరుదులు బస్టాండ్‌లోనే అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
జగజిత్, జషన్ కౌర్ ప్రేమించుకుని కుటుంబ సభ్యుల వ్యతిరేకతను కాదని నెల క్రితం వివాహం చేసుకోవడమే ఈ దాడికి కారణమని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
ఘటన జరిగిన రోజున జగజిత్ అత్త కిందర్ కౌర్, తమ ఇంటికి రావాలని చెబుతూ అతడిని తరన్ తారన్ బస్టాండ్‌కు రప్పించింది. అక్కడికి జగజిత్ చేరుకోగానే, అప్పటికే మాటువేసిన అతని బావమరుదులు జస్ప్రీత్ సింగ్, హర్‌ప్రీత్ సింగ్‌లు కత్తులతో చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడి చేశారు.
అతను కింద పడిపోయిన తర్వాత కూడా వదలకుండా దాడి చేయడంతో జగజిత్ శరీరానికి అరవైకి పైగా గాయాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అక్కడున్న వారిలో గురీందర్ సింగ్ అనే వ్యక్తి ధైర్యంగా జోక్యం చేసుకుని నిందితుల్లో ఒకరైన జస్ప్రీత్ సింగ్‌ను పట్టుకోగా, పరారైన మరొకరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply