హిమాలయాల్లో ఆకస్మికంగా హిమానీనదం విరిగిపడటంతో ఉత్తర నేపాల్ ప్రాంతంలోని నదుల్లో పెను వరదలు పోటెత్తాయి.
ఈ ప్రకృతి విపత్తు దాటికి ఆ ప్రాంతంలోని నాలుగు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇళ్లు, భవనాలు, వాహనాలతో పాటు ప్రజలు సైతం వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 600 మందికి పైగా మరణించినట్లు సమాచారం వెలువడగా, రెండు వేల మందికి పైగా గల్లంతవడంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
నేపాల్లో సంభవించిన ఈ ఘోర విపత్తు పొరుగు ప్రాంతాలను తీవ్ర అప్రమత్తం చేసింది. దీని ప్రభావంతో భారత దేశానికి చెందిన సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రక్షణ, ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టింది. సిక్కిం రాష్ట్రంలో చిన్నవీ పెద్దవీ కలిపి మొత్తం 400లకు పైగా హిమానీనద సరస్సులు ఉండగా, వాటిలో అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన 16 సరస్సులకు అత్యాధునిక సెన్సార్లను అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సిక్కిం తరహాలోనే చైనా, టిబెట్, నేపాల్ సరిహద్దులకు లోబడి ఉన్న హిమాలయ ప్రాంతాలలోని ప్రమాదకర హిమానీనదాలలోనూ త్వరలోనే సెన్సార్లను అమర్చనున్నారు. ఇలాంటి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు భవిష్యత్తులో హిమానీనదాలు పగిలిపోయే ప్రమాదాలను కచ్చితత్వంతో గుర్తించి, తక్షణ హెచ్చరికలను జారీ చేయడానికి, తద్వారా భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడానికి ఎంతగానో తోడ్పడతాయని భావిస్తున్నారు.

Leave a Reply