అమెరికా, ఇరాన్ మధ్య గత ఫిబ్రవరిలో ఉద్రిక్తతలు/యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, అంతకుముందే గత ఏడాది నవంబర్‌లో అమెరికాకు చెందిన భారీ విమానవాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ సముద్రయానానికి బయలుదేరింది.
సాధారణంగా అమెరికా యుద్ధనౌకల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ఆరు నెలల వ్యవధిలోనే స్వదేశానికి తిరుగుముఖం పడతారు. కానీ ఈసారి ఏడాది గడుస్తున్నా వారు ఇంకా ఒడ్డుకు చేరలేదు. సుదీర్ఘ కాలం పాటు సముద్రంలోనే గడపడంతో నావికులు తీవ్ర మానసిక కుంగుబాటుకు, ఒత్తిడికి గురైనట్లు అమెరికన్ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ క్రమంలో మానసిక ఒత్తిడిలో ఉన్న సైనికులకు విశ్రాంతి కల్పించేందుకు ‘అబ్రహం లింకన్’తో పాటు మరో రెండు నౌకలు థాయిలాండ్‌లోని ‘లేమ్ చబాంగ్’ పోర్టులో లంగరు వేయనున్నట్లు సమాచారం అందింది.
ఈ నౌకాశ్రయానికి సమీపంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బీచ్ రిసార్ట్ నగరం ‘పట్టాయా’ ఉంది. యుద్ధనౌకల్లోని 5,000 మందికి పైగా నావికులు ఈ నగరంలోని రిసార్టుల్లో బస చేసి సేదదీరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఎక్కువ కాలం సముద్రంలోనే గడిపిన సైనికులు తమ అలసటను దూరం చేసుకునేందుకు మద్యం, వినోద కార్యక్రమాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో.. అక్కడ వ్యభిచార కార్యకలాపాలు ఊపందుకుంటాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దీన్ని అదుపు చేసేందుకు స్థానిక పోలీసులు ముందస్తు నిఘా పెంచారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న సెక్స్ వర్కర్లపై ప్రత్యేక నిఘా ఉంచి అరెస్టులు ప్రారంభించారు. ఇప్పటివరకు అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న 40 నుంచి 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఈ అంశంపై పట్టాయా పోలీస్ చీఫ్ అనేక్ స్రాథోంగ్యు మాట్లాడుతూ.. “వ్యభిచారాన్ని పూర్తిగా అరికట్టడం చాలా కష్టమైన వ్యవహారం. మేము మా వంతు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. అయినప్పటికీ, పోలీసుల కళ్లుగప్పి పబ్లిక్ ప్రదేశాల్లో వీరు కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది” అని పేర్కొన్నారు.
మరోవైపు, ఈ పర్యటన స్థానిక ఆర్థిక రంగానికి మేలు చేస్తుందని కూడా భావిస్తున్నారు. పట్టాయాలో బస చేసే సమయంలో ఒక్కో అమెరికన్ నావికుడు రోజుకు సగటున 30 నుంచి 91 డాలర్ల వరకు ఖర్చు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇది పట్టాయా ఆర్థిక వ్యవస్థకు స్వల్పకాలంలో గణనీయమైన ఊతం ఇస్తుందని నగర మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply