రామనాథపురం జిల్లాలోని మూప్పన్వలసై గ్రామానికి చెందిన 22 ఏళ్ల సరితకు, లోకేష్ అనే యువకుడితో గత కొంతకాలంగా ప్రేమ సంబంధం ఉంది.
అయితే లోకేష్ ప్రవర్తన, అతడి వ్యవహారశైలి నచ్చకపోవడంతో సరిత అతడితో సంబంధాన్ని తెంచుకుంది. విషయం అర్థం చేసుకున్న సరిత తల్లిదండ్రులు ఆమెకు మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. ఈ వివాహం గత 30వ తేదీన జరగాల్సి ఉండగా, ఇంట్లో పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి.
తన మాజీ ప్రియురాలి పెళ్లి జరగబోతోందని తెలుసుకున్న లోకేష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. సరితపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో, గతంలో ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలను తన వాట్సాప్ స్టేటస్‌తో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఈ విషయం, ఆ ఫొటోలు వరుడి కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో పెళ్లి జరగడానికి కొద్దిసేపటి ముందు వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు సమాచారం.
బంధువులు, గ్రామస్తుల సమక్షంలో తన పెళ్లి ఆగిపోవడంతో సరిత తీవ్ర మనోవేదనకు గురైంది. తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆమె.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సరిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం రామనాథపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.
అయితే సరిత మృతికి కారణమైన లోకేష్‌ను వెంటనే అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని తరలించేందుకు అనుమతించబోమని ఆమె బంధువులు తీవ్ర ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
లోకేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు.
ప్రస్తుతం లోకేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Reply