అమెరికా, ఇరాన్‌ల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర స్థాయికి చేరాయి.
దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్, సిరిక్ కౌంటీ పరిధిలోని కుహెస్తాక్ ప్రాంతంలో ఒక పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటిపై అమెరికా దళాలు ఊహించని రీతిలో ఆకస్మిక క్షిపణి దాడికి పాల్పడ్డాయి. ఈ భీకర దాడిలో ఒక చిన్నారితో సహా ఐదుగురు దుర్మరణం చెందగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ రెడ్‌క్రెసెంట్ అధికారికంగా ధ్రువీకరించింది.
దాడి జరిగిన ప్రదేశంలో భవనాలు కుప్పకూలి భారీ విధ్వంసం జరిగినట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసిన వీడియో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి. బాధితులు, స్థానికుల ఆర్తనాదాల మధ్య ఈ భయానక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. జనావాస ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిని పచ్చి “యుద్ధ నేరం”గా హోర్మోజ్గాన్ ప్రావిన్స్ భద్రతా విభాగ డిప్యూటీ గవర్నర్ అహ్మద్ నఫీసీ తీవ్రంగా ఖండించారు. ఘటనా స్థలానికి రెస్క్యూ బృందాలు హుటాహుటిన చేరుకోగా, ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను అంచనా వేస్తున్నారు.
ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధి తీరంలో ఈ సిరిక్ కౌంటీ ఉంది. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై క్షిపణులను ప్రయోగించినందుకు, సముద్ర మార్గంలో మందుపాతరలు అమర్చేందుకు యత్నించినందుకే ప్రతీకారంగా దక్షిణ ఇరాన్ మరియు కెర్మాన్ ప్రావిన్స్ విమానాశ్రయంపై ఈ దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ఇరాన్ తిరిగి ప్రతీకార చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించారు.
అమెరికా చేపట్టిన ఈ మెరుపు దాడిపై ఇరాన్ నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమైంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికార ప్రతినిధి సర్దార్ హుస్సేన్ మొహెబీ మాట్లాడుతూ.. “అమెరికా తమ చర్యలకు తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది, దురాక్రమణ దళాలకు తగిన శాస్తి తప్పదు” అని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య రోజురోజుకూ ముదురుతున్న ఈ ఘర్షణ వాతావరణం పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర అశాంతిని, ప్రపంచవ్యాప్తంగా పెను ఉద్రిక్తతలను రేకెత్తిస్తోంది.

Leave a Reply