అమెరికాలో రాబోయే నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు, ఆసియా-అమెరికన్ వర్గాల మధ్య ‘ఏఏపీఐ డేటా’ (AAPI Data) నిర్వహించిన తాజా సర్వే అంతర్జాతీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
భారత సంతతి అమెరికన్ (ఇండో-అమెరికన్) ఓటర్లలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రిపబ్లికన్ పార్టీకి ఉన్న ప్రజాదరణ భారీగా పడిపోతున్నట్లు ఈ సర్వే స్పష్టం చేస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 66% మంది డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించగా, కేవలం 22% మంది మాత్రమే రిపబ్లికన్ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. సెనేట్ ఎన్నికల మద్దతు విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది; అందులో 66% మంది డెమొక్రాటిక్ పార్టీకి అనుకూలంగా ఉండగా, రిపబ్లికన్ పార్టీకి కేవలం 18% మంది మాత్రమే మొగ్గు చూపారు. ఆసియా-అమెరికన్ కమ్యూనిటీలన్నింటిలోనూ భారత సంతతి వారే డెమొక్రాట్లకు అత్యధికంగా జై కొడుతుండటం గమనార్హం.
2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో కార్నెగీ ఎండోమెంట్ నిర్వహించిన సర్వేలో, ఇండో-అమెరికన్లలో ట్రంప్‌కు 32% మద్దతు లభించింది; ముఖ్యంగా పురుషుల ఓటర్లలో ఇది 40% వరకు నమోదైంది. అయితే, నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కనిపించిన ఆ సానుకూలత శాశ్వత మద్దతుగా రూపాంతరం చెందలేదని తాజా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. దాదాపు 20 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ శక్తివంతమైన వర్గం తిరిగి తమ సాంప్రదాయ మద్దతు పక్షమైన డెమొక్రాటిక్ పార్టీ వైపే మొగ్గు చూపుతోందని స్పష్టమైంది. రోజురోజుకూ పెరుగుతున్న రాజకీయ ప్రాబల్యం కలిగిన ఈ వర్గం మద్దతు కోసం ఇరు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో, ఈ మార్పు రిపబ్లికన్లకు గట్టి ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు.
ఓటర్ల నిర్ణయాలను ప్రభావితం చేయడంలో జీవన వ్యయం, ద్రవ్యోల్బణంతో కూడిన ఆర్థిక సంక్షోభాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదే సమయంలో వైద్యారోగ్యం, నేరాలు మరియు విదేశాంగ విధానం కూడా వారి ప్రధాన ప్రాధాన్యతలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా, ఇరాన్‌తో ఉద్రిక్తతలు రాజుకుంటున్న నేపథ్యంలో.. సర్వేలో పాల్గొన్న వారిలో 78% మంది విదేశాంగ విధానం, యుద్ధ పరిస్థితులు తమకు అత్యంత కీలకమైన అంశాలని పేర్కొన్నారు. ఈ ప్రాధాన్యతా అంశాలన్నింటిలోనూ రిపబ్లికన్ల కంటే డెమొక్రాట్లనే తాము ఎక్కువగా విశ్వసిస్తున్నామని ఆసియా-అమెరికన్ ఓటర్లు స్పష్టం చేశారు.
ఆర్థిక అంశాలకు అతీతంగా, అమెరికాలో పెరుగుతున్న జాత్యహంకారం, అసహనపూరిత వాతావరణం ఇండో-అమెరికన్లలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీయేతరులైన భారతీయ అమెరికన్లలో 27% మంది.. మైనారిటీల పట్ల ఆ పార్టీ ప్రదర్శిస్తున్న అసహన వైఖరే తాము వ్యతిరేకించడానికి ప్రధాన కారణమని వెల్లడించారు. 2024తో పోలిస్తే ఈ సంఖ్య 10% పెరిగింది. క్లుప్తంగా చెప్పాలంటే, ఆర్థిక అంశాలు మాత్రమే కాకుండా.. మైనారిటీల పట్ల రాజకీయ వైఖరి, సామాజిక భద్రతలే ఓటర్ల తీర్పును నిర్దేశించే ప్రధాన శక్తులుగా మారాయి.

Leave a Reply