200 ఏళ్లుగా ఈ ఇంట్లో ఆడపిల్లే పుట్టలేదట.. ఇప్పుడు పుట్టిన బిడ్డకు ఇచ్చిన స్వాగతాన్ని200 ఏళ్లుగా ఈ ఇంట్లో ఆడపిల్లే పుట్టలేదట! ఇప్పుడు పుట్టిన చిన్నారికి ఇచ్చిన ఘన స్వాగతం చూడండి.. మేళతాళాలు, ఆటపాటలు.. ఒక మహారాణికి కూడా ఇలాంటి స్వాగతం దక్కదేమో!

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన ఒక కుటుంబంలో దాదాపు 200 సంవత్సరాల తర్వాత ఆడపిల్ల జన్మించడం తీవ్ర ఆనందోత్సాహాలను నింపింది.

నాలుగు తరాలుగా ఆ ఇంట్లో ఆడపిల్ల పుట్టలేదు. ఇప్పుడు జన్మించిన ఆ పాపకు ‘గార్గి’ అని పేరు పెట్టారు. చిన్నారి రాకను కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆసుపత్రి నుంచి తల్లీబిడ్డలు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారికి అపూర్వ స్వాగతం పలికారు. ఈ స్వాగత వేడుక స్థానికుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది.

హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన గార్గిని, ఆమె తల్లిని రంగురంగుల పూలతో అలంకరించిన రథంలో కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకువచ్చారు. దారిపొడవునా మేళతాళాలు మోగుతుండగా, బంధుమిత్రులు ఆనందంతో చిందులేశారు. ఆడపిల్ల రాకను ఆ కుటుంబం ఒక మహోత్సవంలా జరుపుకుంది. ఒక రాకుమారిలా చిన్నారిని స్వాగతించిన ఈ దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

గార్గి నానమ్మ సురేఖ దహిఫలే మాట్లాడుతూ.. పాప పుట్టగానే ఆసుపత్రి నుంచి ఇంటికి తెచ్చేటప్పుడు ఇంత గొప్పగా స్వాగతం పలకాలని కుటుంబమంతా ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పాప రాక తమ కుటుంబంలో ఎనలేని సంతోషాన్ని తెచ్చిందన్నారు. అలాగే చిన్నారి తాతయ్య లింబాజీ దహిఫలే స్పందిస్తూ.. తరతరాలుగా తాము ఆడపిల్ల కోసం ఎదురుచూశామని, ఆ కల ఇప్పుడు నెరవేరిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంట్లోని కోడళ్లను కూడా తాము కన్నకూతుళ్లలాగే చూసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

గార్గి తండ్రి కూడా తన కుమార్తె జననంతో అమితానందం వ్యక్తం చేశారు. కూతుళ్లకు తండ్రితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందని, తన బిడ్డను పూలలా ఎంతో గారాబంగా, ప్రేమతో పెంచుకుంటానని చెప్పారు. ఆడపిల్ల పుట్టుకను ఒక కుటుంబం ఇలా ఘనంగా వేడుక చేసుకోవడం, సమాజంలో ఆడపిల్లలపై ఉన్న దృక్పథం మారాలనే ఒక మంచి సందేశాన్ని ఇచ్చింది. దాదాపు 200 ఏళ్ల తర్వాత జన్మించిన గార్గికి పలికిన ఈ అద్భుత స్వాగతం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *