కోయంబత్తూరులో ప్రియుడి అప్పులు తీర్చి, లగ్జరీ కార్ కొనుక్కొని విలాసవంతమైన జీవితం గడపాలనే ప్లాన్‌తో 70 ఏళ్ల వృద్ధురాలి మెడలోని 4 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిన ఎంబీఏ విద్యార్థి, విద్యార్థినిలను పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు.
కోయంబత్తూరు కేజీ చావిడి పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో రెండో సంవత్సరం ఎంబీఏ చదువుతున్న తిరుప్పూర్‌కు చెందిన భరణిధరన్ (21), తిరునెల్వేలికి చెందిన సింధు (21) అనే ప్రేమజంట ఈ దురాగాతానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరు పోతనూరు సమీపంలోని వెల్లలూరుకు చెందిన సరస్వతి (70) అనే వృద్ధురాలు తన ఇంటి ముందు బంధువులతో మాట్లాడుతుండగా, స్కూటర్‌పై వచ్చిన భరణిధరన్ నల్లటి మాస్క్ ధరించి డెంటల్ క్లినిక్, డాక్టర్ అడ్రస్ అడుగుతూ మాటల్లో దించాడు. బామ్మ దారి చూపుతున్న తరుణంలో, క్షణాల వ్యవధిలోనే ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసును బలంగా లాగాడు. దీంతో ఆమె కిందపడిపోగా, అప్పటికే స్టార్ట్ చేసి సిద్ధంగా ఉంచిన స్కూటర్‌పై వేచిచూస్తున్న ప్రియురాలు సింధుతో కలిసి భరణిధరన్ అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితురాలు సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోతనూరు పోలీసులు కేసు నమోదు చేసి, 3 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, అందులో రికార్డైన స్కూటర్ నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించారు. ఘటన జరిగిన 24 గంటల వ్యవధిలోనే ఆ కళాశాల జంటను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి 4 తులాల బంగారు గొలుసు, 2 మొబైల్ ఫోన్లు, మాస్క్, స్కూటర్ నంబర్ ప్లేట్‌ను కప్పిపుచ్చేందుకు ఉపయోగించిన బ్లాక్ టేప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసు వివరాలను కోయంబత్తూరు సౌత్ డీసీపీ కార్తికేయన్ వెల్లడిస్తూ.. విద్యార్థి భరణిధరన్ తన ప్రియురాలికి విలాసవంతమైన బహుమతులు ఇచ్చేందుకు స్నేహితుల వద్ద సుమారు ₹75 వేల వరకు అప్పులు చేశాడని తెలిపారు. ఆ అప్పులు తీర్చి, కొత్తగా విలాసవంతమైన కారు కొని జాలీగా తిరగాలనే ఉద్దేశంతోనే సింధు వేసిన ప్లాన్ ప్రకారం ఈ చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నారు. తొలిసారే నేరానికి పాల్పడిన ఈ జంట సీసీటీవీల ఆధారంగా దొరికిపోయారని తెలిపారు. విలాసాల మోజులో పడి భవిష్యత్తును నాశనం చేసుకుని జైలుపాలైన ఈ కళాశాల విద్యార్థుల ఉదంతం కోయంబత్తూరులో తీవ్ర కలకలం రేపింది.

Leave a Reply