భారతదేశంలో తొలిసారి రైలు సర్వీసులు ప్రారంభమైన తర్వాత దాదాపు యాభై ఏళ్లకు పైగా ప్రయాణికుల కోసం రైలు బోగీల్లో ఎలాంటి టాయిలెట్ సదుపాయాలూ ఉండేవి కావు.
దీంతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారు తమ కాలకృత్యాల కోసం రైలు స్టేషన్లలో ఆగే సమయంపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఉండేది. ఈ పరిస్థితుల్లో, 1909 జూలై 2వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని అహ్మద్‌పూర్ రైల్వే స్టేషన్లో జరిగిన ఒక ఊహించని ఉదంతం భారతీయ రైల్వే వ్యవస్థ గమనాన్నే పూర్తిగా మార్చివేసింది.
ఆ సమయంలో రైలులో ప్రయాణిస్తున్న అఖిల్ చంద్ర సేన్ అనే ప్రయాణికుడు పనసపండు తిన్న కారణంగా తీవ్ర కడుపునొప్పితో విలవిల్లాడిపోయాడు. రైలు ఆగగానే ఒక చెంబు నీటితో స్టేషన్‌లోని టాయిలెట్‌కు పరుగుతీసిన ఆయన, కాలకృత్యాలు తీర్చుకుని బయటకు వచ్చేలోపే రైలు బయలుదేరేందుకు గార్డ్ విజిల్ వేసే శబ్దం వినిపించింది. దీంతో ఒక చేతిలో నీళ్ల చెంబు, మరో చేతితో ధోవతీని పట్టుకుని ప్లాట్‌ఫామ్ వైపు పరుగులు తీస్తుండగా ఆయన కాలుజారి కింద పడిపోయాడు. నలుగురి ముందూ జరిగిన ఈ ఘోర పరాభవంతో ఆయన తీవ్ర అవమానానికి గురయ్యాడు.
ఈ అవమానంతో రగిలిపోయిన ఆయన.. సంబంధిత గార్డును ఉద్యోగం నుంచి తొలగించకపోతే పత్రికలకు ఈ విషయాన్ని చేరవేస్తానంటూ హెచ్చరిస్తూ రైల్వే డివిజనల్ కార్యాలయానికి అత్యంత ఘాటైన ఒక లేఖ రాశారు. ఆ లేఖలోని తీవ్రతను గుర్తించిన నాటి బ్రిటిష్ రైల్వే బోర్డు.. 50 మైళ్లకు పైగా ప్రయాణించే అన్ని లోయర్ క్లాస్ బోగీల్లో తక్షణమే టాయిలెట్లను ఏర్పాటు చేయాలని చారిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. నేటి రైళ్లలో మనం చూస్తున్న ప్రాథమిక సదుపాయానికి పునాదిగా నిలిచిన ఆ చారిత్రాత్మక లేఖను ప్రస్తుతం న్యూఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియంలో భద్రంగా భద్రపరిచారు.

Leave a Reply