బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా మక్సూద్పూర్ గ్రామంలో జరిగిన ఓ వివాహం ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
శారీరక వైకల్యాన్ని ఎదుర్కొంటున్న మహమ్మద్ ఇంతియాజ్, మూగదైన నజ్మా పర్వీన్ ఒకరినొకరు అర్థం చేసుకుని దాంపత్య బంధంలోకి అడుగుపెట్టారు. శారీరక లోపాలు ఉన్నప్పటికీ, ప్రేమ, నమ్మకం, పరస్పర అవగాహనలతో ముందుకు సాగవచ్చని వీరి పెళ్లి నిరూపించింది. ఇరు కుటుంబాల ఆమోదంతో వీరి వివాహం వైభవంగా జరిగింది.
చండిహా గ్రామానికి చెందిన ఇంతియాజ్ చిన్నతనం నుంచే శారీరక వైకల్యంతో పోరాడుతున్నాడు. సుమారు 4 లేదా 5 సంవత్సరాల వయస్సులోనే దివ్యాంగుడిగా మారిన అతడి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అయితే, ఆ సమస్యలకే పరిమితం కాకుండా, సొంత కాళ్లపై నిలబడాలన్న పట్టుదలతో రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లి మొబైల్ రిపేరింగ్ శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ పూర్తి చేసుకుని స్వగ్రామానికి తిరిగి వచ్చి, మొబైల్ రిపేర్ షాపును ఏర్పాటు చేసుకుని తన కష్టార్జితంతో జీవనం సాగిస్తున్నాడు.
తన జీవిత పోరాటాన్ని అర్థం చేసుకోగల వ్యక్తినే భాగస్వామిగా ఎంచుకోవాలని ఇంతియాజ్ భావించాడు. ఆ సమయంలోనే మక్సూద్పూర్కు చెందిన నజ్మా పర్వీన్‌ను కలిశాడు. నజ్మా మాట్లాడలేకపోయినప్పటికీ, వారిద్దరి మధ్య చక్కటి మానసిక బంధం ఏర్పడింది. ఒకరి పరిస్థితిని మరొకరు అర్థం చేసుకుని, కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. వీరి నిర్ణయానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు స్థానిక పోలీసు అధికారులు సైతం హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తనలాగే జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్న నజ్మా బాధలు, భావోద్వేగాలను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని ఇంతియాజ్ తెలిపాడు. నజ్మా మాట్లాడలేకపోయినా, తన మనసును అర్థం చేసుకుని తోడుగా నిలుస్తుందన్న పూర్తి నమ్మకం తనకు ఉందని పేర్కొన్నాడు. శారీరక లోపాల కంటే పరస్పర అవగాహన, తోడునీడగా నిలవడమే అసలైన దాంపత్యమని ఈ జంట చాటిచెప్పింది.

Leave a Reply