మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా 5 ఏళ్ల లోపు చిన్నారుల సంఖ్య కంటే 65 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా భారీగా పెరిగిపోయిందని అమెరికా జనగణన విభాగం (US Census Bureau) వెల్లడించిన తాజా నివేదిక ప్రపంచ దేశాలను తీవ్ర ఆలోచనలో పడేసింది.
ఈ విప్లవాత్మక జనాభా మార్పునకు ప్రధానంగా రెండు బలమైన కారణాలను ఈ నివేదిక ప్రస్తావించింది. మారుతున్న ఆధునిక జీవనశైలి, ఆలస్యంగా చేసుకుంటున్న వివాహాలు, పెరిగిపోతున్న జీవన వ్యయం, కుటుంబ నియంత్రణపై అవగాహన వంటి కారణాల వల్ల అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండింటిలోనూ జననాల రేటు తీవ్రంగా పడిపోయింది.
రెండో ప్రధాన కారణం.. మనిషి సగటు ఆయుర్దాయం గణనీయంగా పెరగడం. అత్యాధునిక వైద్య సేవలు, మెరుగైన పౌష్టికాహారం, మెరుగైన పారిశుద్ధ్యం, ప్రభుత్వ ఆరోగ్య పథకాల ఫలితంగా గత తరాలతో పోలిస్తే నేటి తరం ఎక్కువ కాలం జీవించగలుగుతోంది. గతంలో జపాన్, రష్యా, దక్షిణ కొరియా, ఐరోపా దేశాల్లో మాత్రమే కనిపించిన ఈ వృద్ధాప్య జనాభా పెరుగుదల.. ప్రస్తుతం ఆసియా, లాటిన్ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలకూ వేగంగా విస్తరించింది.
వృద్ధాప్యం అనేది సాధారణంగానే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. అందులోనూ పేదరికంలో మగ్గే వృద్ధులకు, ఒంటరిగా జీవించే వృద్ధులకు ఇది మరింత దుర్భరమైన, వేదనాభరితమైన కాలమని నివేదిక హెచ్చరిస్తోంది. ఆధునిక కాలంలో కుటుంబ పరిమాణాలు కుంచించుకుపోవడం, పిల్లలు వద్దనుకునే దంపతుల సంఖ్య పెరగడం పెను ఆందోళనకు దారితీస్తోంది. వృద్ధాప్యంలో తమను ఆదరించేందుకు కుటుంబ సభ్యులపై ఆధారపడలేని పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో సర్వసాధారణంగా మారుతున్నాయి.
వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న ఈ సరికొత్త ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా ప్రపంచ దేశాల ప్రభుత్వాలు తమ భవిష్యత్ ఆర్థిక విధానాలు, గృహ నిర్మాణ ప్రణాళికలు, ఆరోగ్య రంగ నమూనాలను తక్షణమే మార్చుకోవాలని నివేదిక గట్టిగా సూచిస్తోంది. లేనిపక్షంలో భవిష్యత్తులో వృద్ధుల సంరక్షణ అతిపెద్ద సామాజిక సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.
పిల్లల సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య రాకెట్ వేగంతో పెరగడం భవిష్యత్ శ్రామిక శక్తిపై (వర్కింగ్ క్లాస్) తీవ్రమైన ఒత్తిడిని తీసుకురానుంది. ఈ సంక్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వాలు, సమాజం పరస్పరం సమన్వయంతో పనిచేయడంతో పాటు, వృద్ధుల సామాజిక భద్రతా పథకాలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

Leave a Reply