ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని ‘రతన్ ఆర్బిట్’ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న 63 ఏళ్ల ఔషధ వ్యాపారి వినీత్ మినోచా తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు.
దుండగులు ఆయనను ఏకంగా 26 సార్లు కత్తితో పొడిచి, గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి మృతుడి 36 ఏళ్ల కోడలు శాలు (షాలు)తో పాటు హత్యకు పాల్పడిన విశాల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
మామ వినీత్ మినోచా ఇంట్లో సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచడం, ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వడంలో తీవ్ర ఆంక్షలు విధించడంతో కోడలు శాలు ఆయనపై తీవ్ర ద్వేషం పెంచుకుంది. ధనిక కుటుంబమే అయినప్పటికీ చిన్న చిన్న ఖర్చులకు కూడా మామ ముందు చేయి చాచాల్సి రావడంతో, అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఇంట్లో పనిచేసే విశాల్ అనే యువకుడితో రూ.6 లక్షల సుపారీ మాట్లాడుకుని ఈ హత్యకు పథకం రచించింది.
సంఘటన జరిగిన రోజున భర్త, పిల్లలతో కలిసి పార్టీకి వెళ్తున్నట్లు నమ్మించి బయటకు వెళ్లిన శాలు, సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి హంతకులకు ఇంటి డూప్లికేట్ తాళాలు ఇచ్చి లోపల రహస్యంగా దాక్కోవడానికి సహకరించింది.
ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధుడు గదులను పరిశీలిస్తున్న సమయంలో లోపల నక్కిన దుండగులు ఆయనపై దాడి చేసి చంపేశారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు, హత్యకు కొన్ని రోజుల ముందు నుంచే కాకుండా సంఘటన జరిగిన రోజు కూడా శాలు, నిందితుడు విశాల్ పలుమార్లు ఫోన్లో మాట్లాడినట్లు కాల్ రికార్డుల (CDR) ద్వారా గుర్తించారు. మొదట్లో పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన శాలు, పోలీసుల విచారణలో మామను అంతమొందించడానికి రూ.6 లక్షల ఒప్పందం కుదుర్చుకున్న నిజాన్ని అంగీకరించింది.

Leave a Reply