హర్యానాలో ఆన్లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్ ఆర్డర్‌ను, డెలివరీ చేయాల్సిన బాయ్ వేరే వ్యక్తులకు అమ్మేసిన విచిత్ర ఘటన సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించి తీవ్ర చర్చకు దారితీసింది.
రిషభ్ కౌశిక్ అనే వ్యక్తి అర్ధరాత్రి వేళ ప్రముఖ యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయగా, నిర్దేశిత సమయం దాటిపోయినా ఆర్డర్ చేతికి రాకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది.
దీంతో యాప్‌లోని లైవ్ ట్రాకింగ్ మ్యాప్‌ను పరిశీలించగా, డెలివరీ బాయ్ బైక్ దాదాపు 40 నిమిషాలకు పైగా ఒకే చోట ఆగి ఉండటాన్ని చూసి విస్తుపోయాడు. పరిస్థితిని స్వయంగా తేల్చుకుందామని ఆ లొకేషన్‌కు వెళ్లి చూడగా, తన ఫుడ్ ఆర్డర్‌ను వేరే ఇద్దరు వ్యక్తులకు ఆ డెలివరీ బాయ్ కేవలం రూ. 100కే తెగనమ్ముతుండటం కనిపించింది. దీనిని ఆయన అక్కడికక్కడే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని బట్టబయలు చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, యాప్ లొకేషన్ స్క్రీన్షాట్లను తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ, కంపెనీ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్‌కు నేరుగా ట్యాగ్ చేశాడు.
“ఇది ఇకపై ఫుడ్ డెలివరీ కాదు, పూర్తిస్థాయి ఫుడ్-షేరింగ్ ఎకానమీగా మారిపోయింది” అంటూ ఆయన వ్యంగ్యంగా పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన కంపెనీ కస్టమర్ కేర్ బృందం, వెంటనే అతనితో మాట్లాడి ఆర్డర్ ఐడీ సహా పూర్తి వివరాలను సేకరించింది. డెలివరీ సేవలలో బాధ్యతారాహిత్యం, గిగ్ ఎకానమీలోని లోపాలను ఈ ఘటన ఎత్తిచూపుతూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపింది.

Leave a Reply