మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో, భార్య ఇన్స్టాగ్రామ్లో మరొకరితో చాటింగ్ చేస్తోందన్న అనుమానంతో ఆమె పుట్టింటికి వెళ్లి భర్త కత్తితో కిరాతకంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
భర్త జరిపిన ఈ దాడిలో ముఖం, వీపు, చేతులపై తీవ్ర గాయాలైన ఆ యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం… నిషా అహిర్వార్ అనే యువతికి, ఆమె భర్త వికాస్ పాల్కు కొద్దిరోజుల క్రితం గొడవ జరిగింది. దీంతో నిషా తన తల్లిగారి ఇంటికి వెళ్లి ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో అక్కడికి వచ్చిన వికాస్, నిద్రపోతున్న నిషాతో గొడవపడ్డాడు. అనంతరం ఆమె జుట్టు కత్తిరించి, ఆపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ దాడిలో నిషా ముఖం, వీపు, చేతులపై తీవ్రమైన గాయాలయ్యాయి. ఘటన సమయంలో ఇంట్లో ఆమె సోదరీమణులు ఉన్నారని, తల్లి బయటకు వెళ్లినట్లు తెలిసింది. దాడి అనంతరం వికాస్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావమైన నిషాను ‘జయారోగ్య’ ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
నిషా, వికాస్లకు నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం జరిగింది. వీరి వివాహానికి ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించలేదు. అయితే, నిషా ఇన్స్టాగ్రామ్లో వేరొకరితో చాటింగ్ చేస్తోందని, వారితో ప్రేమ వ్యవహారం నడుపుతోందని వికాస్ అనుమానించడమే ఈ దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వికాస్ పాల్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
