“రైలును ఆపండిరా బాబూ!”.. స్టేషన్లలో ఆగకుండా దూసుకెళ్లిన ఏసీ లోకల్ ట్రైన్.. భయంతో ప్రయాణికుల ఆర్తనాదాలు.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్.!

పాన్వెల్ నుండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) వైపు వెళ్తున్న ఎయిర్ కండిషన్డ్ (AC) లోకల్ రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రైలు మార్గమధ్యంలో ఏ స్టేషన్‌లోనూ ఆగకుండా నిరంతరాయంగా దూసుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ‘ముంబై రైల్ ప్రవాసి సంఘ్’ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్న ఈ వీడియోలో, ప్రయాణికులు అత్యవసర ఇంటర్‌కామ్ ద్వారా లోకో పైలట్‌ను సంప్రదించడానికి ప్రయత్నిస్తూ, తీవ్ర ఆందోళనతో కేకలు వేయడం కనిపించింది.

రైల్వే భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల సంఘం రైల్వే అధికారులను కోరింది. దీనిపై స్పందించిన అధికారిక ‘రైల్వే సేవా’ విభాగం.. తగిన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపింది. అలాగే, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ఇలాంటి పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

మరోవైపు, ఆ రైలు సాధారణ ప్రయాణికుల సేవల కోసం నడుస్తున్నది కాదని, అది కార్ షెడ్ / డిపోకు వెళ్లే రైలు కావడంతోనే స్టేషన్లలో ఆగలేదని ఒక నెటిజన్ పేర్కొన్నారు. ఈ విషయమై ముందే అనౌన్స్‌మెంట్ చేసినప్పటికీ ప్రయాణికులు రైలు ఎక్కారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ అంశంపై రైల్వే శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ వెలువడలేదు.


Posted

in

by

Tags: