తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-3 ప్రాంతంలో ధరంవీర్ ధనువా (42) అనే గూడ్స్ వాహన డ్రైవర్ను కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు.
ఆదివారం తెల్లవారుజామున దుర్గా దేవాలయం సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని స్థానికులు లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసుల దర్యాప్తులో ఈ హత్యకు సంబంధించి 22 ఏళ్ల యువకుడు, అతని 17 ఏళ్ల మేనల్లుడిని (సోదరి కుమారుడు) అదుపులోకి తీసుకున్నారు. మృతుడు ధరంవీర్కు, ఆ బాలుడి తల్లికి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. తన తల్లి ధరంవీర్ గుడిసెలో ఉండటాన్ని సదరు మైనర్ బాలుడు చూశాడు. వెంటనే ఈ విషయాన్ని తన మేనమామకు చెప్పడంతో, ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్లి ధరంవీర్తో గొడవపడ్డారు.
వాగ్వాదం పెరగడంతో, ఇద్దరూ కలిసి కర్రలతో ధరంవీర్పై తీవ్రంగా దాడి చేశారు. తలకు బలమైన గాయం కావడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో ఉన్న సెక్యూరిటీ గార్డు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతడిని కూడా బెదిరించి నిందితులు పరారయ్యారు. అనంతరం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, పక్కా సమాచారం ఆధారంగా నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు.
