“అతడిని కూడా వదిలిపెట్టను”.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త.. ఫ్రిజ్‌లో తలను దాచిన వైనం.. పోలీసులకు కనిపించిన దృశ్యాలతో షాక్..!!

అస్సాం రాష్ట్రం గువాహటిలో 25 ఏళ్ల రియా తలూక్దార్ అనే యువతి తన భర్త చేతిలోనే దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

గువాహటిలోని బెల్టోలా–బశిష్ఠాపూర్ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న రియా.. ఫ్యాన్సీ బజార్‌లోని ఓ బట్టల దుకాణంలో పనిచేసేది. కొన్నేళ్లుగా ప్రేమించుకున్న రియా, ఉబర్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేసే రామానుజ్ గోస్వామిని గత ఏడాది సెప్టెంబర్‌లో ఆలయంలో వివాహం చేసుకుంది. తొలినాళ్లలో సంతోషంగా సాగిన వీరి దాంపత్య జీవితంలో కొన్ని నెలలకే విభేదాలు మొదలై, తరచూ గొడవలు జరిగేవని సమాచారం.

సెప్టెంబర్ 3న మరోసారి భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రామానుజ్.. రియాపై దాడి చేసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఇంటికి బయట నుంచి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పాటు, కొన్ని రోజులుగా ఇల్లు తాళం వేసి ఉండటాన్ని గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. మృతదేహం లభించింది. అనంతరం ఇంటిని పూర్తిగా తనిఖీ చేయగా, ఫ్రిజ్‌లో నల్లటి పాలిథిన్ బ్యాగ్‌లో చుట్టి ఉంచిన రియా తలతో పాటు కొన్ని వేళ్లను కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, పరారీలో ఉన్న రామానుజ్ హతిగావ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ప్రాథమిక విచారణలో.. రియాకు మరో వ్యక్తితో సంబంధం ఉందనే అనుమానంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు రామానుజ్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా, తన భార్యతో సంబంధం ఉందని అనుమానిస్తున్న వ్యక్తిని కూడా చంపుతానని అతడు చెప్పినట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి రామానుజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని కోర్టు రిమాండ్‌కు తరలించగా, హత్యకు దారితీసిన కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Posted

in

by

Tags: