ఇదెక్కడి విడ్డూరం..! 50 అడుగుల వాటర్ ట్యాంక్‌పైకి ఈజీగా ఎక్కేసిన ఎద్దు. 3 రోజులుగా అక్కడే ధర్నా.. దానికేం కావాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్న జనం.. వైరల్ అవుతున్న విచిత్ర వీడియో!

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లా ధధూని గ్రామంలో చోటుచేసుకున్న ఒక విచిత్రమైన ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గ్రామంలోని 50 అడుగుల ఎత్తైన తాగునీటి ట్యాంక్‌పైకి ఒక ఎద్దు ఎక్కి పైభాగానికి చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత మూడు రోజులుగా ఆ ట్యాంక్ పైనే తిష్టవేసిన ఆ ఎద్దు, కిందకు దిగేందుకు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు.

ఈ వింత ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో షియోపూర్‌లో కొందరు వ్యక్తులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఇలాంటి వాటర్ ట్యాంకులపైకి ఎక్కి నిరసన తెలిపిన ఘటనలను గుర్తుచేస్తూ.. ‘మరి ఈ ఎద్దు డిమాండ్ ఏంటి? ఎందుకోసం ట్యాంక్ ఎక్కి ధర్నా చేస్తోంది?’ అంటూ ఫన్నీ కామెంట్లతో పోస్టులు పెడుతున్నారు.

అయితే, అంత ఎత్తైన ట్యాంక్‌పైకి ఇంత భారీ ఎద్దు ఎలా చేరుకుందనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ అర్థం కావడం లేదు. ట్యాంక్ పైభాగంలో ప్రమాదకర స్థితిలో నిల్చున్న ఎద్దును చూసి ఆందోళన చెందిన గ్రామస్తులు, సోమవారం అర్ధరాత్రి ట్యాంక్ పైకి వెళ్లి దానికి తాగునీరు, మేతను ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతానికి దానికి ఆహార సమస్య తప్పినప్పటికీ, అంత ఎత్తు నుంచి దాన్ని సురక్షితంగా కిందకు ఎలా దించాలనేది జిల్లా యంత్రాంగానికి, అటవీ శాఖ అధికారులకు పెద్ద సవాలుగా మారింది.

దీనిపై స్థానిక గ్రామస్తుడు దేవేంద్ర మాట్లాడుతూ.. “ఎద్దు చాలా ఎత్తులో ఉంది, ఏమాత్రం కాలుజారినా ప్రాణాలకే ప్రమాదం. అందుకే దాన్ని క్షేమంగా కిందకు దించేలా చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ, పశుసంవర్ధక శాఖ మరియు పోలీసులకు సమాచారం అందించాం” అని తెలిపారు.


Posted

in

by

Tags: