ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి.
ఈ వరదల ప్రభావం కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులను కూడా వదిలిపెట్టడం లేదు. బరేలీ జిల్లా షేర్గఢ్ పరిధిలోని బైరమ్గఢ్ గ్రామ పంచాయతీలో ‘జల్ జీవన్ మిషన్’ కింద స్థానిక ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు భారీ ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ను నిర్మించారు. సుమారు రూ.3.97 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ట్యాంక్, కిచ్చా నదిలో చోటుచేసుకున్న తీవ్ర భూకోత కారణంగా అకస్మాత్తుగా నదిలోకి కుప్పకూలిపోయింది.
గత వారం కిచ్చా నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో నదీతీరంలో భారీగా కోత మొదలైంది. గత గురువారం ఈ వాటర్ ట్యాంక్ చుట్టూ ఉన్న రక్షణ గోడ సైతం నది ప్రవాహంలో కొట్టుకుపోయింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ అమర్చిన సోలార్ ప్యానెళ్లు, జనరేటర్లు మరియు ఇతర విలువైన సామగ్రిని ట్రాక్టర్లలో వేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే నది ఉధృతి తీవ్రం కావడంతో ఆ భారీ ట్యాంక్ పట్టు కోల్పోయి పేకమేడలా నదిలోకి ఒరిగిపోయి కూలింది.
దీనిపై గ్రామ సర్పంచ్ షంషుల్ ఖాన్ మాట్లాడుతూ.. “ఈ ట్యాంక్ నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేసినప్పుడు కిచ్చా నది ఇక్కడికి దాదాపు 500 మీటర్ల దూరంలో ప్రవహించేది. కానీ గత రెండు, మూడేళ్లుగా నిరంతరం జరుగుతున్న భూకోత కారణంగా నది నెమ్మదిగా ట్యాంక్ దిశగా చొచ్చుకువచ్చింది” అని తెలిపారు. నది తమ గ్రామాన్ని ముంచెత్తేలా దగ్గరకు వస్తోందని గ్రహించిన గ్రామస్తులు అధికారులకు పలుమార్లు విన్నవించినా, గట్టు కోతను అరికట్టేందుకు రాతి రక్షణ గోడలు నిర్మించలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ గ్రామంలో ఇప్పటికే ‘జల్ జీవన్ మిషన్’ కింద పైపులైన్లు వేసి, దాదాపు 70 శాతం ఇళ్లకు నల్లా కనెక్షన్లు కూడా పూర్తిచేశారు. త్వరలోనే తమ ఇంటికే స్వచ్ఛమైన తాగునీరు వస్తుందని ఆశించిన ప్రజల ఏళ్ల కల ఇప్పుడు నదిపాలైంది. ప్రస్తుతం అక్కడ కేవలం ఒక చిన్న గది మాత్రమే మిగిలి ఉండగా, అది కూడా కోతకు గురై ప్రమాదకర స్థితిలో నదిపై వేలాడుతోంది.
