గుజరాత్లోని సర్ఖేజ్ సమీపంలో, తన ప్రియుడితో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 22 ఏళ్ల యువతిని ఆమె తండ్రి, సోదరుడు కలిసి ‘పరువు హత్య’ చేసిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది.
వస్త్ర వ్యాపారం చేసే వీరిద్దరూ, మూడు నెలల క్రితం బయటకు వచ్చిన ఆ వీడియోపై తీవ్ర ఆగ్రహంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
సంఘటన జరిగిన రోజు ఆ యువతిని ఖేల్జీపురా ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి, సుత్తితో బలంగా కొట్టి అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా, ఈ హత్యను ఓ సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవడానికి నాటకమాడారు.
అయితే పోలీసుల ముమ్మర విచారణలో ఇది ప్రమాదం కాదని, పక్కా ప్రణాళికతో చేసిన పరువు హత్యేనని బట్టబయలైంది. దీంతో నేరానికి పాల్పడిన తండ్రి, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
