పాకిస్థాన్లోని కరాచీ నగరంలో మత సామరస్యానికి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ భావోద్వేగభరిత వీడియో నెట్టింట విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.
అక్కడ నివసిస్తున్న మహారాష్ట్ర కుటుంబాలు నిర్వహిస్తున్న చారిత్రక హిందూ దేవాలయం ‘మేధ్ మందిర్’ కోసం వినాయక చవితి సందర్భంగా శ్రీ గణపతి విగ్రహాన్ని రూపొందించారు. ఆ విగ్రహానికి ముస్లిం వర్గానికి చెందిన ఓ కళాకారుడు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఏకాగ్రతతో రంగులు వేస్తూ అందంగా తీర్చిదిద్దుతున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.
“ఎవరు హిందువు? ఎవరు ముస్లిం? ఇది గణపతి బప్పా మహిమ, కరాచీ అందం” అనే వ్యాఖ్యతో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియో స్వల్ప కాలంలోనే 1,61,000 కంటే ఎక్కువ వీక్షణలను సొంతం చేసుకుంది. “రాజకీయ, మతపరమైన విభేదాలను దాటి మానవత్వం, కళ మాత్రమే అంతిమంగా గెలుస్తాయి”, “ఇలాంటి మానవీయ ఘటనలే ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మారుస్తాయి” అంటూ భారత్, పాకిస్థాన్లకు చెందిన నెటిజన్లు ఎంతో భావోద్వేగంతో కామెంట్లు పెడుతున్నారు.
